కాకినాడ లీగల్: కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మహిళా ఓటర్ల గణనను పారదర్శకంగా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో శనివారం సచివాలయ అడ్మిన్లు, వీఆర్వోలు, మహిళా ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల ఆది, సోమవారాల్లో ఇంటింటా వెరిఫికేషన్ నిర్వహించి, 27న ప్రాథమిక వివరాలను ప్రచురించాలని, వాటిపై అభ్యంతరాలు, అభ్యర్థనలు వస్తే మరోసారి పరిశీలించి 29వ తేదీకి ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. సర్వే బృందాలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో నిర్ధారించాలని, కులాలకు సంబంధించిన సందేహాలు తలెత్తితే వీఆర్వోలు సంబంధిత రికార్డులు, ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా పరిశీలించాలని ఆదేశించారు. గణనలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని, విధుల్లో నిర్లక్ష్యం వహించినా, తప్పుడు సమాచారం నమోదు చేసినా బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


