ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 29 నుంచి నవంబర్ 6 వరకు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు దేవదాయ శాఖ ఉప కమిషనర్ ఆలయ ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఈ మేరకు స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. శేష వాహన సేవతో ఉత్సవాలు ప్రారంభిస్తామని తెలిపారు. ఆయా రోజుల్లో ఆలయంలో ఆర్జిత సేవలు, సామూహిక అష్టోత్తర పూజలు, ఐశ్వర్య లక్ష్మీ హోమాలు, కల్యాణాలు రద్దు చేశామన్నారు.
నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు
అమలాపురం టౌన్: అమలాపురం దసరా ఉత్సవాల్లో ఐ.పోలవరం ఎస్సై రవీంద్రబాబును కత్తితో పొడిచి దాడికి పాల్పడిన నిందితులపై పట్టణ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ పి.వీరబాబు తెలిపారు. ఎస్సైపై దాడికి పాల్పడిన కొంకాపల్లి దసరా ఉత్సవ కమిటీకి చెందిన ఐదుగురిని ప్రధాన నిందితులుగా, మరి కొంతమందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.
ఉరేసుకుని ఒడిశా వాసి మృతి
చింతూరు: స్థానిక వినాయకుడి గుడి ముందు భాగంలో ఉన్న వరండాలో ఐరన్ పైపునకు ఉరేసుకుని ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా తోపగూడకు చెందిన గంగా మాడి (54) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం కలకలం రేపింది. గురువారం రాత్రి గుడి వద్దకు వచ్చిన సదరు వ్యక్తి దేవుడిని దర్శించుకుని వెళ్లాడని, ఉదయం చూసేసరికి వరండాలో ఐరన్ దూలానికి ఉరేసుకుని మృతి చెంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన చింతూరు ఎస్సై సంతోష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ స్తంభం విరిగిపడి వ్యక్తి మృతి
కొత్తపల్లి: ప్రమాదవశాత్తూ విద్యుత్ స్తంభం విరిగిపడడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన ముప్పిడి నూకరాజు (80) తన ఇంటి వద్ద అరుగు వద్ద టిఫిన్ చేస్తుండగా, చెట్టుకొమ్మ విరిగి విద్యుత్ స్తంభంపై పడింది. ఆ విద్యుత్ స్తంభం నూకరాజుపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై ఎస్సై వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాలువలో పడి వ్యక్తి మృతి
పెద్దాపురం: మండలంలోని ఉలిమేశ్వరం గ్రామంలో శుక్రవారం తెల్లవారు జామున పంట కాలువలోకి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఆ గ్రామానికి చెందిన దనువురెడ్డి అచ్చన్న (48) ఉదయాన్ని బయటకు వెళ్లి పంట కాలువలో జారిపడిపోయాడు. దీనిని స్థానికులు గుర్తించి అతన్ని బయటకు తీసి, ప్రైవేటు వాహనంలో పెద్దాపురం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే అచ్చన్న మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు భార్య నాగమణి ఫిర్యాదు మేరకు పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
సినిమా చూసి వచ్చేసరికి ఇంట్లో చోరీ!
గొల్లప్రోలు (పిఠాపురం రూరల్): కుటుంబ సభ్యులతో కలిసి సినిమాకు వెళ్లిన ఓ వ్యక్తి తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్ల అయిన వైనమింది. ఈ ఘటన గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా నివాసం ఉంటున్న ఊటుకూరి సుబ్రహ్మణ్యం తన కుటుంబ సభ్యులతో కలసి 22వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో సినిమా చూసేందుకు పిఠాపురం వెళ్లారు. తిరిగి అర్ధరాత్రి 12.20 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. లోపలికి వెళ్లి పరిశీలించగా, బీరువాలోని 204 గ్రాముల బంగారు ఆభరణాలు, 850 గ్రాముల వెండి వస్తువులతో పాటు కొంత నగదు కనిపించలేదు. దీంతో గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ ఎన్.దుర్గారావు పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గొల్లప్రోలు ఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేశారు.


