కాకినాడ క్రైం: పోలీసు అమర వీరులకు కలెక్టర్ ఎంఎన్ హరీంధర్ ప్రసాద్, ఎస్పీ జి.బిందుమాధవ్, ఇతర అధికారులు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యాన స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం బుధవారం జరిగింది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమర వీరులకు కలెక్టర్, ఎస్పీ తదితరులు నివాళులర్పించారు. అమర వీరుల కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు, పండ్లు, నగదు సాయాన్ని కలెక్టర్, ఎస్పీ అందజేశారు. కార్యక్రమంలో దేవిన సిస్టర్స్ సోహిత, ధన్యతలు అమరుల త్యాగాలను ప్రతిబింబించేలా రూపొందించిన సైతక శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మూడో బెటాలియన్‌లో..
కాకినాడ రూరల్: ఏపీఎస్పీ మూడో బెటాలియన్‌లో జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవంలో దేశం కోసం, ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన 154 మంది పోలీసు అమర వీరులకు కమాండెంట్ కె.నవీన్ కుమార్, సిబ్బంది నివాళులర్పించారు. బెటాలియన్‌లో పని చేస్తూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర వీరులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో నివాళులర్పించారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ దేవానందరావు తదితరులు పాల్గొన్నారు.


