● చిన్న తిరుపతిలో
ప్రారంభమైన దివ్య బ్రహ్మోత్సవాలు
● గజ వాహనంపై గోవిందుడి విహారం
ద్వారకాతిరుమల: కలియుగ వైకుంఠనాథుడు కొలువైన చిన్నతిరుపతి క్షేత్రంలో శ్రీవారి ఆశ్వయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్వామి, అమ్మవార్లను వరుడు, వధువుగా చేసే వేడుక అట్టహాసంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై నిత్య కల్యాణ మండపం వద్దకు తీసుకువచ్చి అలంకరించారు. ఆలయ ఈఓ సతీమణి భాగ్యలక్ష్మి స్వామి, అమ్మవార్లకు పూలు, పండ్లు, అర్చకులు, పండితులకు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. రాత్రి గజవాహనంపై స్వామివారి తిరువీధి సేవ వైభవంగా సాగింది. ఆలయ ముఖ మండపంలో స్వామివారు శ్రీ భూ సమేత మహావిష్ణువు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానం డీఈఓ వై.భద్రాజీ, ఏఈఓ పి.నటరాజారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 9 గంటలకు ధ్వజారోహణ, అనంతరం హంసవాహన సేవ నిర్వహించనున్నారు.


