అనపర్తి: స్థానిక విశ్రాంత ఉపాధ్యాయిని ఇంట్లో జరిగిన చోరీలో దుండగులు నగదు, నగలు దోచుకుపోయారు. స్థానిక వీరుళ్లమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో నివసిస్తున్న విశ్రాంత ఉపాధ్యాయిని బేబి తల్లి ఇంట్లో బుధవారం రాత్రి జరిగిన చోరీలో సుమారు రూ.3 లక్షల నగదు, 50 గ్రాముల బంగారు ఆభరణాలు దోపిడికి గురైనట్టు చెబుతున్నారు. ఈ విషయమై ఎస్సై వినయ్ ప్రతాప్‌ను వివరణ కోరగా ఎన్నికల విధుల్లో ఉన్నందున ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
కోటసత్తెమ్మకు బంగారు గొలుసు సమర్పణ
నిడదవోలు రూరల్: మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామంలో కొలువైన కోటసత్తెమ్మ తల్లికి దేవరపల్లి మండలం త్యాజంపూడి గ్రామానికి చెందిన యర్రంశెట్టి నాగదుర్గారావు రూ.2 లక్షలు విలువచేసే 16 గ్రాముల బంగారు గొలుసును బుధవారం సమర్పించారు. దాత కుటుంబ సభ్యులను ఆలయ అధికారులు సన్మానించి అమ్మవారి చిత్ర పటాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ కె.లలిత తదితరులు పాల్గొన్నారు.
చెట్టుపై కొండచిలువ హల్‌చల్
రాజమహేంద్రవరం రూరల్: మోరంపూడి సాయినగర్ శివారు బుచ్చియ్యనగర్‌కు వెళ్లే దారిలో ఒక చెట్టుపై మంగళవారం రాత్రి ఒక భారీ కొండచిలువ హల్‌చల్ చేసింది. రోడ్డు పక్కన ఉండే చెట్టుపై కొండచిలువ కనపడడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. కొండచిలువ కదులుతున్న దృశ్యాలను చిత్రీకరించి వైరల్ చేశారు. మోరంపూడి పరిసర ప్రాంతాల్లో గుట్టలు, చెట్లు ఉండడంతో కొండచిలువల సంచారానికి అనువుగా ఉంటాయని నగరానికి చెందిన స్నేక్ క్యాచర్ ఈశ్వర్ తెలిపారు.


