బాలాజీచెరువు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులకు, 60 ఏళ్లు పైబడిన వారికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) కాకినాడ జిల్లా శాఖ నాయకులు కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శేశెట్టి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పోతు రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడి ఉంటుందని, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉపాధ్యాయులు, వయో భారం కలిగిన సీనియర్ ఉపాధ్యాయులు ఈ విధులు నిర్వర్తించడం ఎంతో శ్రమతో కూడుకున్న విషయమన్నారు. ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, వారికి మినహాయింపు ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు. ఉపాధ్యాయుల సమస్యలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి, నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని సంఘ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకుడు గుమ్మాపు రామతేజ్ తదితరులు పాల్గొన్నారు.
పీజీఆర్ఎస్ రద్దు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ప్రతి సోమవారం కాకినాడ కలెక్టరేట్లో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ను రద్దు చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఈ రద్దు కొనసాగుతుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


