ఉద్యోగుల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు! | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు!

Oct 15 2026 8:36 AM | Updated on Oct 15 2026 8:36 AM

● రెండున్నరేళ్ల పాలనలో హామీలు ఏమయ్యాయి?

● వైఎస్సార్‌ సీపీ ఎంప్లాయీస్‌ విభాగం

రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఎన్నికల ముందు ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌ సీపీ ఎంప్లాయీస్‌ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖరరెడ్డి అన్నారు. కాకినాడలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉద్యోగులకు వంద శాతం కరవు భత్యం, హెచ్‌ఆర్‌ఏ, ఇతర బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు మెరుగైన వేతన సవరణ, మధ్యంతర భృతి, కరవు భత్యం ఇస్తామంటూ కూటమి నేతలు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీల అమలుపై ఉద్యోగులకు స్పష్టత లేదని, వేతనాలు, భత్యాల చెల్లింపుల విషయంలో ఎదురు చూపులు కొనసాగుతున్నాయని అన్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నర్సులు, వైద్య, ఆరోగ్య శాఖలోని ఇతర సిబ్బంది సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. కోవిడ్‌ సమయంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందించిన సిబ్బంది విషయంలో ప్రభుత్వ వైఖరి ఆందోళన కలిగిస్తోందని అన్నారు. అర్హత, అనుభవం ఉన్న కింది స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఉద్యోగోన్నతుల కోసం ఎదురు చూస్తున్న సిబ్బందికి న్యాయం చేయడంతో పాటు ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చంద్రశేఖరరెడ్డి కోరారు.

వైఎస్సార్‌ సీపీ ఎంప్లాయీస్‌, పెన్షనర్ల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి రామారావు మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యలను కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం చేయకుండా, ఏయే బకాయిలున్నాయి, వాటి చెల్లింపులకు ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలి, వైద్య, ఆరోగ్య శాఖలో పని చేసిన సిబ్బందికి ఎలాంటి భరోసా కల్పించాలనే విషయంపై స్పష్టమైన కార్యచరణ అవసరమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలే వేదికగా ప్రభుత్వానికి సమాధానం చెప్పాలంటూ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల విజయంలో అందరూ కీలక పాత్ర పోషించాలని కోరారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరించి స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కండెల పెద్దిరాజు, సభ్యులు రమణ, ఎల్‌.సోమినాయుడు, పి.శ్రీనివాస్‌, డి.వెంకట రమణ, సి.అర్జునరావు, తుమ్మల నూకరాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement