అంబాజీపేట/అమలాపురం రూరల్: హైదరాబాద్ నుంచి అమలాపురం వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బుధవారం అదుపు తప్పి, కముజువారిలంక పంచాయతీ సమీపాన ఉన్న ప్రధాన పంట కాలువ అంచుల వరకూ దూసుకెళ్లింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామం నుంచి ఓ సైక్లిస్ట్ ప్రధాన రహదారికి అడ్డంగా వచ్చాడు. అదే సమయంలో ఓ లారీ కూడా ఎదురుగా రావడంతో ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఈశ్వరరాజు బస్సును చాకచక్యంగా ఎడమ వైపు తిప్పాడు. దీంతో, ఆ బస్సు ప్రధాన కాలువ పంట అంచు వరకూ వెళ్లి ఆగింది. అత్యవసర మార్గం ద్వారా బస్సులోని 15 మంది ప్రయాణికులు క్షేమంగా బయట పడ్డారు. ఎవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన బస్సు డ్రైవర్ ఈశ్వరరాజును జిల్లా రవాణా అధికారి (డీటీఓ) శ్రీనివాసరావు అమలాపురంలో సత్కరించారు. డ్రైవింగ్ అంటే వాహనం నడపటమే కాదని, మెళకువతో వ్యవహరించి, రోడ్డు ప్రమాదం జరగకుండా చూడడమేనని అన్నారు. రోడ్లపై తప్పులు చేసే డ్రైవర్లను శిక్షించడంతో పాటు ప్రయాణికుల ప్రాణాల్ని కాపాడి ఇటువంటి డ్రైవర్లను సత్కరించే బాధ్యత కూడా తమపై ఉందని చెప్పారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రవికుమార్, వరప్రసాద్ కూడా పాల్గొన్నారు.


