బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): శాసన మండలి ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి నూతన ఓటర్ల జాబితాను అత్యంత పకడ్బందీగా రూపొందించాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని ఆరు జిల్లాల రెవెన్యూ, ఎన్నికల విభాగం, విద్య, ఇంటర్మీడియెట్ తదితర శాఖల అధికారులతో కలెక్టరేట్ నుంచి బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నూతన ఓటర్ల జాబితా రూపకల్పనకు అనుసరించాల్సిన విధివిధానాలపై అవగాహన కల్పించి, ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. అర్హత కలిగిన ప్రతి ఉపాధ్యాయుడినీ ఓటరుగా నమోదు చేయించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు వచ్చే నెల ఆరో తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. వచ్చే నెల 25న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించి, డిసెంబర్ పదో తేదీ వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పారు. పార్ట్‌టైమ్ టీచర్లకు, బోధనేతర సిబ్బందికి ఈ ఓటు హక్కు ఉండదని చెప్పారు. అర్హులైన వారు ఫారం–19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు దరఖాస్తులు స్వీకరించి, క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే తదుపరి ప్రక్రియకు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ ప్రియ, ఉమ్మడి ఉభయ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఈఆర్‌ఓ, కాకినాడ డీఆర్‌వో డి.తిప్పేనాయక్ తదితరులు పాల్గొన్నారు.


