బాలుర విజేతగా శ్రీకాకుళం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన నిర్వహించిన 70వ రాష్ట్ర స్థాయి అండర్–17, అండర్–19 బాలబాలికల రగ్బీ పోటీలు మంగళవారం ముగిశాయి. కాకినాడలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్‌లో జరిగిన ముగింపు వేడుకల్లో కాకినాడ డివిజన్ ఉప విద్యాశాఖాధికారి కేవీవీ సత్యనారాయణ విజేతలకు ట్రోఫీలు, మెడల్స్ అందజేసి, అభినందించారు. విజేతల వివరాలను ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.శ్రీనివాస్, అడ్మిన్ సెక్రటరీ వీపీఎస్ శేషుకుమారి వెల్లడించారు. బాలికల విభాగంలో తూర్పు గోదావరి జిల్లా జట్టు విజయకేతనం ఎగురవేసింది. ద్వితీయ స్థానం(రన్నర్స్)లో గుంటూరు, తృతీయ స్థానంలో విశాఖపట్నం జిల్లాల జట్లు నిలిచాయి. బాలుర విభాగం విజేతగా శ్రీకాకుళం నిలిచింది. ద్వితీయ స్థానం(రన్నర్స్)లో నెల్లూరు, తృతీయ స్థానంలో తూర్పు గోదావరి జిల్లాల జట్లు నిలిచాయి. కార్యక్రమంలో వ్యాయామోపాధ్యాయ సంఘం కార్యదర్శి వి.మాచరిరావు, కోశాధికారి నాగలింగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు ఎల్.గోవిందరాజులు, అబ్జర్వర్ కుమార్, వ్యాయామోపాధ్యాయులు వి.రవిరాజు, కె.శ్రీనివాసరావు, శ్రీనివాస్ కుమార్, బంగార్రాజు, పట్టాభిరామం, వెంకటేష్, సుబ్రహ్మణ్యం, జయలక్ష్మి, చంద్రావతి, సువర్చల, మంగమ్మ పాల్గొన్నారు.


