● జిల్లాలు విడివడినా జట్లు మాత్రం
ఉమ్మడిగానే
● ఎస్‌జీఎఫ్‌ఐ పోటీలపై ప్రభుత్వం నిర్లక్ష్యం
● రెండు నెలల ఆలస్యంగా షెడ్యూల్ విడుదల
● విడుదల కాని నిధులు..
● దాతల సాయంతో పోటీల నిర్వహణ
● ఎన్నో అవకాశాలు కోల్పోతున్న విద్యార్థులు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): పాఠశాల స్థాయి విద్యార్థుల్లో క్రీడా ప్రతిభకు పదును పెట్టి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్ది, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించాలనే ఉద్దేశంతో పాఠశాల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్‌ఐ) పోటీల నిర్వహణకు సన్నద్ధమవుతోంది. అండర్–14, 17, 19 విభాగాల్లో బాలికలు ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ నిరూపించుకుంటున్నారు. క్రీడలకు పెద్దపీట వేస్తున్నాం, క్రీడా కోటాను మూడు శాతం పెంచాము, క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాం అని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పాఠశాల క్రీడలకు కేటాయించిన నిధులు, రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతున్న తీరు, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు జిల్లా జట్లను పంపడంతో ఎదురౌతున్న ఇబ్బందులును చూస్తే ప్రభుత్వానికి క్రీడలపై ఎంత శ్రద్ధ ఉందో అర్ధమవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఏటా సెప్టెంబర్‌లో విడుదలయ్యే ఎంపికల షెడ్యూలు రెండు నెలల ఆలస్యంగా విడుదల చేసి ఎస్‌జీఎఫ్‌ఐ ఆధ్వర్యంలో 12 క్రీడాంశాల్లో అమరావతి చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించింది. జూలైలో నియమించాల్సిన కార్యదర్శుల నియామకాలు సెప్టెంబరులో నిర్వహించడం కూడా షెడ్యూలు ఆలస్యానికి ఒక కారణమని పలువురు పేర్కొటున్నారు. మరోవైపు జాతీయ స్థాయి పోటీల తేదీలు రావడంతో జిల్లా ఎంపికలు నిర్వహించి, రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్లు పంపడం నిర్వాహకులకు కత్తిమీద సాములా తయారైంది.
గత ఏడాది రాష్ట్ర విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగ ఉన్న జిల్లాలకు ఎస్‌జీఎఫ్‌ఐ క్రీడలకు సుమారు 7 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఈ నిధులతో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల నిర్వహణ, వివిధ రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు వెళ్లే జిల్లా క్రీడాకారులకు రవాణా ఖర్చులు, స్పోర్ట్స్ కిట్లను (డ్రస్, షూ) అందించారు. ఈ ఏడాది రెండు నెలలు ఆలస్యంగా షెడ్యూలు ప్రారంభమైనా ఇప్పటి వరకు రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఎస్‌జీఎఫ్‌ఐ బడ్జెట్ కేటాయించక పోవడంతో ఆయా జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీలను దాతల సాయంతో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే జట్లకు రవాణా ఖర్చులు ఎస్‌జీఎఫ్‌ఐ నిర్వహణను కార్యదర్శులే తమ సొంత డబ్బులతో ఏర్పాటు చేసుకుని జట్లను పంపాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది 11 క్రీడాంశాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా జట్లను పంపించారు.
జిల్లాలు విభజించినా ఎంపికలు ఉమ్మడిగానే
రాష్ట్రంలోని 13 జిల్లాలు 26 జిల్లాలుగా పునర్విభజన జరిగి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, రాజమహేంద్రవరం, కోనసీమ, పోలవరం జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే. ఏటా ఎస్‌జీఎఫ్‌ఐ పోటీలను డీఈఓ అధ్యక్షతన జిల్లాలోని సీనియర్ పీడీలను కార్యదర్శులుగా నియమించి నిర్వహించేవారు. కాగా రెండేళ్లుగా ఇద్దరు కార్యదర్శులను విద్యాశాఖ రాష్ట్ర సంచాలకుడు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఒకరు నిర్వహణ కార్యదర్శి కాగా, రెండో వారు అడ్మిన్ కార్యదర్శి. నిధుల వినియోగం, నిధులు అందుకోవడం వంటి చెక్ పవర్ డీఈఓ, అడ్మిన్ కార్యదర్శికి ఉమ్మడిగా కల్పించారు. గతంలో కార్యదర్శుల పదవీ కాలం రెండేళ్లు ఉండేది. దానిని ప్రస్తుతం ఏడాదికి కుదించారు. ప్రస్తుతం కాకినాడ, కోనసీమ, రాజమహేంద్రవరం జిల్లాలకు ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శులను వేరువేరుగా నియమించినా జట్ల ఎంపిక మాత్రం ఉమ్మడిగానే సాగిస్తున్నారు.
క్రీడాకారులకు తీవ్ర అన్యాయం
ఎస్‌జీఎఫ్‌ఐ (స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో అండర్–14, 17, 19 విభాగాల్లో ఏటా సుమారు 34 క్రీడాంశాల్లో క్రీడాకారులను జిల్లా స్థాయిలో ఎంపిక చేసి రాష్ట్ర, జాతీయస్థాయికి పంపిస్తారు. ప్రతి క్రీడలో అండర్–14, 17, 19లో బాలుర జట్లు వేరుగా, బాలికల జట్లు వేరుగా ఆయా క్రీడలను బట్టి ఎంపిక చేస్తారు. ఉదాహరణకు హాకీలో 16 మంది సభ్యులతో జట్టు ఉంటుంది. అంటే అండర్–14లో బాలురు 18 మంది, బాలికలు 18 మంది, అండర్–17లో బాలురు 18 మంది చొప్పున, అండర్–19లో బాల బాలికలు 18 మంది చొప్పున ఒకొక్క జిల్లా నుంచి ఎంపిక చేయాలి. ఖోఖో, కబడ్డీ, ఫుట్‌బాల్ పోటీలకు ఒక్కొక్క విభాగంలో 12 మంది చొప్పున ఎంపిక చేయాలి. కానీ నేడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో మూడు జిల్లాలకు కలిపి ఒకే జట్టును ఎంపిక చేయాల్సిరావడంతో ఎక్కువ మంది బాల బాలికలు పోటీలకు వెళ్లే అవకాశాలను కోల్పోతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి పెట్టి పోటీలకు నిధులు విడుదల, ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన కాకుండా విభజిత జిల్లాల వారీగా ఎంపికలు జరిగేలా చూడాలని పీడీలు, క్రీడా సంఘాల ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు కోరుతున్నారు.


