సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు
తాటిపాక మధు
బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచలేరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు విమర్శించారు. సీఈసీ రాజీనామా కోరుతూ శనివారం ఢిల్లీలో ఆందోళన చేసిన విద్యార్థులు, యువజనులపై పోలీసులు లాఠీచార్జి చేయడం, అక్రమంగా నిర్బంధించడం అప్రజాస్వామికమన్నారు. స్థానిక సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన స్థానిక మదర్ థెరిస్సా విగ్రహం వద్ద నుంచి కోకిల సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజల ఓటు హక్కు, ఎన్నికల పారదర్శకత, రాజ్యాంగ పరిరక్షణ కోసం గొంతెత్తే వారిని లాఠీలతో భయపెట్టలేరన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకునే వరకు ప్రజాస్వామ్య పోరాటం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, మహిళా సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కేత అరుణ, మల్లాల్సి శ్యామ్ పాల్గొన్నారు.


