కాకినాడ క్రెం: తాకట్టు బంగారం దుర్వినియోగానికి పాల్పడిన స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడా జీజీహెచ్ బ్రాంచ్ గోల్డ్ అప్రైజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసు కార్యాలయంలో శనివారం ఎస్పీ బిందుమాధవ్ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామం బైబిల్ మిషన్ చర్చి ఎదురుగా నివసిస్తున్న 50 ఏళ్ల నరవ సూరిబాబు జీజీహెచ్ బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. ఖాతా దారులు రుణాల కోసం తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను దొంగిలించి అవే నమూనాల్లో నకిలీ ఆభరణాలు చేయించి లాకర్లలో పెట్టేవాడు. ఇలా 1056.90 గ్రాముల బంగారు ఆభరణాలను దుర్వినియోగం చేశాడు. ఖాతాదారులు విడిపించుకున్న బంగారం నకిలీదని తేలడంతో ఆ గుట్టు బయటపడి పోలీసులు లోతైన విచారణ చేసి 1020.53 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. 44 మంది ఖాతాదారుల బంగారం విలువ సుమారు రూ.1.45 కోట్లని పోలీసులు తెలిపారు. ఏఎస్పీ మహంతి కిశోర్‌కుమార్ పర్యవేక్షణలో వన్ టౌన్ సీఐ ఎం.నాగ దుర్గారావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందాలు కేసు దర్యాప్తు చేపట్టి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. శనివారం ఉదయం నిందితుడిని అరెస్టు చేసినట్టు తెలిపారు.
రేపటి పీజీఆర్‌ఎస్ రద్దు
బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): స్థానిక జేఎన్‌టీయూకేలో సీఐఐ ప్రాంతీయ సదస్సు జరగనున్న నేపథ్యంలో అధికారులు అంతా ఆ కార్యక్రమంలో నిమగ్నం కానుండడంతో సోమవారం జిల్లా కేంద్రంలో జరిగే పీజీఆర్‌ఎస్ రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. శనివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి వ్యయ ప్రయాసలకు పడి జిల్లా కేంద్రానికి రావద్దని కోరారు.
ఒంటికాలిపై వీఆర్‌ఏల నిరసన
పిఠాపురం రూరల్: కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు చేస్తున్న సమ్మె 25వ రోజుకు చేరింది. శనివారం వారు ఒంటి కాలిపై నిలుచుని వినూత్న నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
శ్రీను కుటుంబానికి పరిహారం చెల్లించాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): నక్కపల్లి వద్ద గుండెపోటుతో మరణించిన కాకినాడ డిపో ఆన్ కాల్ డ్రైవర్ జట్ల శ్రీను (34) కుటుంబానికి రెగ్యులర్ ఉద్యోగిలా రూ.80 లక్షల పరిహారం చెల్లించాలని ఏపీఎస్‌ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని కోరుతూ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక డిపో వద్ద శనివారం ధర్నా చేశారు. అనంతరం అసిస్టెంట్ మేనేజర్‌కి వినతిపత్రం సమర్పించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్, ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికుల సంఘ నాయకుడు మలకా రమణ మాట్లాడుతూ గురువారం కాకినాడ డిపో నుంచి విశాఖకు బయలుదేరిన ఆర్టీసీ బస్సులో గుండెపోటు వచ్చినా ప్రయాణికుల ప్రాణాలు కాపాడి మృతి చెందిన జట్ల శ్రీను కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రయాణికుల భద్రతకు బీమా కల్పించే ఆర్టీసీ యాజమాన్యం కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్, రోజువారీ వేతన, ఆన్ కాల్ సిబ్బందికి ఎటువంటి భద్రతా లేకుండా బానిసల్లా పనిచేయించుకుని కష్టం వచ్చినప్పుడు వదిలేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, ప్రభాకర్ వర్మ, తలుపులమ్మ, ఆవుల కాశి, చెక్కల వేణి, మలకా నాగలక్ష్మి, కె.చిట్టిబాబు, టి.రాణి పాల్గొన్నారు.


