● వైఎస్సార్ సీపీ జగ్గంపేట ఇన్‌చార్జి తోట నరసింహం
● గంగంపాలెంలో టిడిపి, జనసేన నుంచి పార్టీలో భారీగా చేరికలు
గోకవరం: మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతోందని వైఎస్సార్ సీపీ జగ్గంపేట ఇన్‌చార్జి తోట నరసింహం అన్నారు. మండలంలోని గంగంపాలెం గ్రామంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన నుంచి సుమారు వంద మందికి పైగా వైఎస్సార్ సీపీలో చేరారు. వీరికి తోట నరసింహం పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జగన్ నాయకత్వలో పనిచేయడానికి ప్రజలు ముందుకు వస్తున్నారని, పార్టీలో కొనసాగుతున్న వారు, నూతనంగా చేరిన వారు సమష్టిగా పని చేసి రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయకేతనం ఎగురవేయాలని పిలుపునిచ్చారు. 2029లో జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దాసరి చినబాబు, సుంకర వీరబాబు, సమ్మెటి మోహన్, అధికారి బుజ్జి, బత్తుల శ్రీను, రౌతు జోగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.


