దేవరపల్లి: గోపాలపురం మండలం చిట్యాల వద్ద శనివారం తాడిపూడి ఎత్తిపోతల పథకం కాలువలో పడి యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం తాళ్లపూడి మండలం అన్నదేవరపేటకు చెందిన యువకుడు దేశాబత్తుల ప్రసాద్ (38) శనివారం ఉదయం గోపాలపురం మండలం పెద్దాపురంలోని బంధువుల ఇంటికి బైక్‌పై వెళ్లాడు. చిట్యాల వద్ద తాడిపూడి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ సమీపంలో బైక్ అదుపు తప్పడంతో ప్రమాదవశాత్తు కాలువలో పడి నీటిలో మునిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో కాలువలో గాలించి యువకుడి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు ప్రసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోపాలపురం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి.సుబ్రహమణ్యం తెలిపారు.


