ట్రేడ్ లైసెన్స్ ఆదాయానికి గండి?
కాకినాడ లీగల్: కాకినాడ నగరంలో దీపావళి బాణసంచా విక్రయాల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలి క దుకాణాల వ్యవహారం వివాదాస్పదమైంది. నగరపాలక సంస్థ పరిధిలో సుమారు 130 దీపావళి షాపులు ఏర్పాటు చేయగా, కొండేపాలెం సమీపంలోనే ఏకంగా 112 షాపులు పెట్టారు. అయితే ఈ దుకాణాల ఏర్పాటులో నిబంధనలు పాటించలేదని, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొండేపా లెం సమీపంలో ఏర్పాటు చేసిన 112 షాపుల వ్యవహారం నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధి అనుచరుడి ఆధ్వర్యంలో జరిగింది. ఒక్కో షాపు యజమా ని నుంచి రూ.55 వేల చొప్పున వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. షాపులను రేకులతో నిర్మించడంతో పాటు విద్యుత్ సదుపాయం కల్పించేందుకు కూడా షాపు యజమానుల నుంచే రూ.55 వేలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ లెక్కన అన్ని షాపుల నుంచి వసూలైన మొత్తం సుమారు రూ.61.60 లక్షలు ఉంటుంది.
ఆదాయానికి గండి!
దీపావళి షాపుల ఏర్పాటుకు సంబంధించి అగ్నిమాపక శాఖ అనుమతి కోసం ఒక్కో షాపు యజమాని రూ.500, ఆర్డీఓ కార్యాలయ అనుమతి కోసం రూ.150 చెల్లించినట్లు తెలుస్తోంది. నగరపాలక సంస్థ నిబంధనల ప్రకారం ఒక్కో షాపునకు రూ.2 వేల చొప్పున ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉన్నప్పటికీ, ఈ షాపులకు సంబంధించి ఆ మొత్తం చెల్లించలేదనే ఆరోపణలు ఉన్నాయి. 112 షాపులకు లెక్కిస్తే రూ.2.24 లక్షల ఆదాయం కార్పొరేషన్‌కు రావాల్సి ఉంది.
మా పరిధి కాదంటూ!
ఈ వ్యవహారంపై నగరపాలక సంస్థ అధికారులను ప్రశ్నించగా, గతంలో తమ ఆధ్వర్యంలో దీపావళి షాపులు ఏర్పాటు చేసినప్పుడు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు వసూలు చేసేవారమని, ప్రస్తుతం మాత్రం ఆర్డీఓ కార్యాలయం ఆధ్వర్యంలోనే ఏర్పాట్లు జరిగాయని అంటున్నారు. ఇటీవల వేట్లపాలెంలో చోటుచేసుకున్న దీపావళి బాణసంచా ప్రమాద ఘటన నేపథ్యంలో ఈసారి ఆర్డీఓ కార్యాలయం ద్వారా అనుమతుల వ్యవహారం నిర్వహించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఆర్డీఓ అనుమతులు ఇచ్చినంత మాత్రాన నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ట్రేడ్ లైసెన్స్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే జనసంచారం ఉన్న కాకినాడ మెయిన్ రోడ్డులో ఒకటి, భానుగుడి సెంటర్‌లో ఒకటి, జేఎన్టీయూ ఎదురుగా మరొకటి చొప్పున దుకాణాలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. జనావాసాల్లో ఈ దుకాణాలకు ఏ ప్రాతిపదికన అనుమతులు ఇచ్చారనేది తెలియాల్సి ఉంది. ఇదంతా స్థానిక ప్రజాప్రతినిధి అనుచరుల కనుసన్నల్లో నడిచిందని ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని నగరవాసులు కోరుతున్నారు.


