రీ కౌంటింగ్‌ అంటూ ఆపేసి.. | - | Sakshi
Sakshi News home page

రీ కౌంటింగ్‌ అంటూ ఆపేసి..

Nov 8 2026 12:43 AM | Updated on Nov 8 2026 12:43 AM

ప్రత్తిపాడు రూరల్‌: కూటమి అభ్యర్థులు గెలిస్తే వెంటనే.. అదే వైఎస్సార్‌ సీపీ శ్రేణులు విజయం సాధిస్తే వాయిదా వేసి అధికారులు ప్రకటించడం విమర్శలకు తావిచ్చింది. ఇలా ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో 27 ఓట్ల మెజార్టీ సాధించినప్పటికీ.. గెలుపు ధ్రువీకరణ పత్రం అందుకునేందుకు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థికి తీవ్ర నిరీక్షణ తప్పలేదు. రీ కౌంటింగ్‌ పేరుతో అధికారులు జాప్యం చేయడంతో తన గెలుపును ప్రకటించాలని కోరుతూ, కన్నీటి పర్యంతమయ్యారు. చివరకు పోలీసుల కాళ్లు పట్టుకుని న్యాయం చేయాలని వేడుకున్నారు. ఎట్టకేలకు అధికారులు గెలుపును ధ్రువీకరించడంతో ఉత్కంఠకు తెరపడింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గొనగాల గోపాలస్వామి (గోపి) 27 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు అనంతరం వెరిఫికేషన్‌ నిర్వహించిన అధికారులు.. రీ కౌంటింగ్‌ పేరుతో గెలుపు ధ్రువీకరణను వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో తనకు స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పటికీ గెలుపును ప్రకటించకపోవడంపై అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు.

గెలుపోటములపై అనుమానాలు

తక్కువ ఓట్ల మెజార్టీ రావడంతో గెలుపోటములను తారుమారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయేమోనని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేశాయి. ఓట్ల లెక్కింపులో తనకు 27 ఓట్ల మెజార్టీ వచ్చిందని, నిబంధనల ప్రకారం తనను విజేతగా ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందించాలని గోపి అధికారులను కోరారు.

సీఐ కాళ్లపై పడి వేడుకోలు

తనకు మెజార్టీ వచ్చినా గెలుపును ప్రకటించకపోవడంతో గోపి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ క్రమంలో ప్రత్తిపాడు సీఐ బి.సూర్య అప్పారావు కాళ్లపై పడి తన గెలుపును ధ్రువీకరించాలని వేడుకున్నారు. అభ్యర్థి ఆవేదన, విజ్ఞప్తుల నేపథ్యంలో చివరకు అధికారులు స్పందించారు. గొనగాల గోపాలస్వామి గెలుపొందినట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. దీంతో ధర్మవరం ఎంపీటీసీ ఎన్నికల ఫలితంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement