గలాటా.. ఆపై గందరగోళం.. పరిషత్ ఎన్నికల కౌంటింగ్ వేళ పరిస్థితి ఇది.
ఈ ఏర్పాట్లలో శాఖల మధ్య సమన్వయ లోపం కనిపించింది. గుక్కెడు నీరు లేక, అల్ఫాహారం, భోజనం కూడా సక్రమంగా అందించక అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది ఇబ్బంది పడడం అధికారుల వైఫల్యాలను ఎత్తిచూపింది. మీడియాకు సమాచారం ఇవ్వడంలోనూ జాప్యం జరగడం ఒకింత అభ్యర్థులకూ అసహనాన్ని పుట్టించింది.
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): పరిషత్
ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ అసౌకర్యాల మధ్య సాగింది. కౌంటింగ్ కేంద్రాలకు వచ్చిన అభ్యర్థులు, వారి ఏజెంట్లకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. కనీసం తాగునీరు, టిఫిన్లు, భోజనం కూడా సక్రమంగా అందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలో 20 జెడ్పీటీసీ, 395 ఎంపీటీసీ స్థానాల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అసౌర్యాల మధ్య జరిగింది. పెద్దాపురం డివిజన్‌కు సంబంధించి పెద్దాపురం మహారాణి డిగ్రీ కళాశాల, కాకినాడ డివిజన్ సంబంధించి పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాకినాడలోని పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధి పెదపూడి, కాజులూరు, కరప, తాళ్లరేవు, కాకినాడ రూరల్, పిఠాపురం, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలతో పాటు పెద్దాపురం రెవెన్యూ డివిజన్ పరిధి సామర్లకోట, తొండంగి మండలాలకు సంబంధించి మొత్తం 10 మండలాల ఓట్ల లెక్కింపు జరిగింది. పెద్దాపురం రెవెన్యూ డివిజన్ పరిధి గండేపల్లి, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని, శంఖవరం, ఏలేశ్వరం, కిర్లంపూడి, రౌతులపూడి, కోటనందూరు, పెద్దాపురం మండలాలకు సంబంధించి మొత్తం 10 మండలాల ఓట్ల లెక్కింపు పెద్దాపురంలోని మహారాణి డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. కాకినాడ పీఆర్ ప్రభుత్వ కళాశాలలో అసౌకర్యాలపై ఏజెంట్లు, అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి బయట నిలబెట్టడమే కాకుండా కనీసం మంచినీరు కూడా అందించలేరా అంటూ అధికారులను నిలదీశారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఆర్డీఓ వర్సెస్ జెడ్పీ సీఈఓ
పీఆర్ ప్రభుత్వ కళాశాలలో కౌంటింగ్ సందర్భంగా అధికారుల మధ్య సమన్వయ లోపం బహిర్గతమైంది. కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కౌంటింగ్‌కు వచ్చిన అభ్యర్థులు, ఏజెంట్లకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదంటూ ఆర్డీఓ జెడ్పీ సీఈఓను ప్రశ్నించారు. దీనికి స్పందించిన జెడ్పీ సీఈఓ మంచినీటి బాటిళ్లు తేవాలంటూ పేర్కొనడంతో ఆర్డీఓ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మంచినీరు తేవడానికి తానేమన్నా అటెండర్‌నా అని ఆర్డీఓ అన్నారు. ఈ క్రమంలో ఇద్దరు అధికారులు గట్టిగా మాట్లాడుకోవడంతో అక్కడున్న వారు ఆశ్చర్యానికి గురయ్యారు. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సమక్షంలోనే ఈ వాగ్వాదం జరిగింది. దీంతో ఆయన జోక్యం చేసుకుని ఇద్దరు అధికారులకు సర్దిచెప్పారు. కౌంటింగ్ ప్రక్రియలో అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
దూరం పెట్టి.. జాప్యం చేసి
కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు అందించడంలోనూ అధికారులు విఫలమయ్యారు. పెద్దాపురం, కాకినాడలలో ఏర్పాటు చేసిన మీడియా పాయింట్లు కౌంటింగ్ కేంద్రాలకు దూరంగా ఉండటంతో పాటు, అక్కడికి చేరుకున్న విలేకరులకు సరైన సమాచారం సకాలంలో ఇవ్వలేదు. ఫలితాల వివరాలు, కౌంటింగ్ పురోగతిని తెలుసుకోవడానికి మీడియా ప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని పలుమార్లు కోరినా అధికారులు స్పందించకపోవడంతో మీడియా ప్రతినిధులు నిరసనకు దిగారు. పెద్దాపురంలో మీడియా పాయింట్ వద్ద పరిస్థితిని గమనించిన జాయింట్ కలెక్టర్ అపూర్వ జోక్యం చేసుకుని విలేకరులకు ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం అందేలా చర్యలు తీసుకున్నారు. అయితే కాకినాడలో మాత్రం సంబంధిత అధికారులు సరైన రీతిలో స్పందించ లేదు.
అధికారుల ‘పచ్చ’పాతం
కౌంటింగ్ ప్రక్రియలో కొందరు అధికారులు ‘పచ్చ’పాత ధోరణితో వ్యవహరించారంటూ వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఆరోపణలు చేశారు. కూటమి అభ్యర్థులకు సంబంధించిన ఓట్ల విషయంలో ఒక విధంగా, వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ఓట్ల విషయంలో మరో విధంగా వ్యవహరించారని వాపోయారు. దీంతో వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి.
ఫలితాలు ఇలా..
జిల్లాలో 395 ఎంపీటీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, శనివారం అర్ధరాత్రికి ఓట్ల లెక్కింపులో జనసేన 97, టీడీపీ 164, వైఎస్సార్ సీపీ 34, స్వతంత్రులు 8, బీజేపీ రెండు స్థానాలు కై వసం చేసుకున్నాయి. ఇంకా 90 స్థానాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అలాగే 20 జెడ్పీటీసీ స్థానాలకు గాను టీడీపీ 6, జనసేన 3, బీజేపీ 2 స్థానాలు కై వసం చేసుకున్నారు. ఇంకా 9 జెడ్పీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది.


