తునిలో వర్షం నీటితో నిండిపోయిన రైల్వే అండర్ పాస్‌ను మూసివేసిన అధికారులు ఎట్టకేలకు శనివారం పునరుద్ధరించారు. వారం రోజులుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 6న ‘సాక్షి’ దినపత్రికలో ‘దారి’దాపుల్లోకి వెళ్లలేక.. అనే శీర్షికన వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. అండర్ పాస్‌లో పేరుకుపోయిన నీటిని ఆయిల్ ఇంజిన్ల సహాయంతో నీటిని బయటకు పంపింగ్ చేశారు. అండర్ పాస్ మళ్లీ అందుబాటులోకి రావడంతో వాహనచోదకులు రాకపోకలు సాగించారు.
– తుని
● వీధివీధి‘కో తి’ప్పలు!
గుంపులుగా వస్తాయి.. కనిపించిన వారిని రక్కేస్తాయి.. పీకేస్తాయి.. వానర గుంపులు హడలెత్తిస్తున్నాయి. ఏలేశ్వరం పట్టణంలో ప్రతి వీధిలోనూ కోతుల బెడద ఎక్కువైంది. ప్రధానంగా సాయిబాబా మెట్ట వద్ద రహదారులపై గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఆలయానికి వెళ్లే భక్తులపై విరుచుకు పడుతున్నాయి. దీంతో వారు భయాందోళన చెందుతున్నారు. ఇళ్లు, పంటలు, దుకాణాల్లోకి చొరబడి నష్టపరుస్తున్నాయి. రాత్రిపూట మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో నిద్రిస్తున్నా, అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా వానర మూకల నుంచి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
– ఏలేశ్వరం


