క్రౌన్‌ ఆఫ్‌ కాకినాడ కిడ్స్‌.. విజేత గ్రీష్మ | - | Sakshi
Sakshi News home page

క్రౌన్‌ ఆఫ్‌ కాకినాడ కిడ్స్‌.. విజేత గ్రీష్మ

Sep 9 2026 12:17 AM | Updated on Sep 9 2026 12:17 AM

బోట్‌క్లబ్‌: స్థానిక డి కన్వెన్షన్‌ హాల్లో మంగళవారం నిర్వహించిన క్రౌన్‌ ఆఫ్‌ కాకినాడ పోటీల్లో జూనియర్‌ కిడ్స్‌ విభాగంలో కాకినాడకు చెందిన ఎస్‌.గ్రీష్మ విజేతగా నిలిచింది. వివిధ విభాగాలు నిర్వహించిన పోటీల్లో పలువురు బాలికలు పాల్గొనగా గ్రీష్మ తన ప్రతిభను చాటుకుంది. కార్యక్రమ నిర్వాహకులు అడ్డాల సతీష్‌ విజేతకు బహుమతులు అందజేశారు. బహుమతి సాధించిన గ్రీష్మను పలువురు అభినందించారు.

గ్రీన్‌ కై ్లమేట్‌ ఫండ్‌ ప్రాజెక్ట్‌

పురోగతిపై సమీక్ష

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లాలో గ్రీన్‌ కై ్లమేట్‌ ఫండ్‌ (జీసీఎఫ్‌) ప్రాజెక్టు పురోగతిపై కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌ ప్రాజెక్టు బృందం, వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జీసీఎఫ్‌ ఆధ్వర్యంలో ఈసీఆర్‌ఐసీసీ ప్రాజెక్ట్‌ ద్వారా తీరప్రాంత ప్రజల్లో వాతావరణ మార్పులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలపై ఈ సందర్భంగా సమీక్షించారు. మడ అడవుల పునరుద్ధరణ, పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ, తీర ప్రాంత ప్రజల కోసం ప్రతిపాదిత జీవనోపాధి కార్యక్రమాలపై చర్చించారు. ముఖ్యంగా అలంకార చేపల పెంపకం, సముద్రపు నాచు (సీవీడ్‌) సాగు, సముద్రంలో కేజ్‌ కల్చర్‌ వంటి ప్రత్యామ్నాయ ఉపాధి యూనిట్ల ఏర్పాటుపై సమీక్ష చేశారు. ప్రతిపాదిత కార్యక్రమాలను సంబంధిత శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయంతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు.

నిరుద్యోగులపై

కక్షపూరిత చర్యలా?

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): కానిస్టేబుల్‌, ఎస్సై తదితర పోలీస్‌ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న నిరుద్యోగులను కాకినాడ పోలీసులు వెంటాడి వేధించడాన్ని సీపీఎం తీవ్రంగా తప్పు పట్టింది. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు మంగళవారం డీఆర్వో తిప్పేనాయక్‌కు వినతి పత్రం ఇచ్చారు. సోమవారం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నిరుద్యోగులు ప్రభుత్వం ప్రకటించిన ఖాళీ పోలీస్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇవ్వాలని, ప్రభుత్వ హామీ మేరకు పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ కాకినాడలో కూడా వేలాదిమంది భారీ ఊరేగింపు, కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారన్నారు. నిరుద్యోగులు రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా తమ విజ్ఞప్తిని ప్రకటించారన్నారు. కడు నిరుపేదలైన నిరుద్యోగ యువతీయువకులు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లెక్కి తమ డిమాండ్‌ని ప్రభుత్వం ముందు ఉంచడాన్ని సహించలేకపోయిన కాకినాడలోని ప్రభుత్వ యంత్రాంగం నిరుద్యోగులపై కక్షపూరిత చర్యలకు దిగడాన్ని తీవ్రంగా నిరసించారు. పోలీసుల తీరుపై విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇది ప్రభుత్వ ప్రేరేపిత చర్యా?

పోలీసుల అత్యుత్సాహమా?

శ్యామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధినేత శ్యామ్‌తో పాటు అనేక మంది నిరుద్యోగులు, విద్యార్థి సంఘం నాయకులపై కేసులు నమోదు చేయడం ప్రభుత్వ ప్రేరేపిత చర్యా లేక పోలీసు అత్యుత్సాహమా? లేక ఇతర శక్తులు ఏమైనా పనిచేస్తున్నాయా? అనే కోణంలో కూడా పూర్తి విచారణ జరపాలని సీపీఎం నాయకులు నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు, నిరుద్యోగులు తమ న్యాయమైన డిమాండ్‌ కోసం ప్రదర్శన, ధర్నాలు చేయకూడదా అని ప్రశ్నించారు. రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాస్తారా అని నిలదీశారు. ఈ చర్య వెనక ఉన్న ఉద్దేశాలు బహిర్గతం కావాలని డిమాండ్‌ చేశారు. కాకినాడ నగరంలో హత్యలు, గంజాయి మాదకద్రవ్యాల వ్యాపారాలు పెరిగిపోయాయని, పోలీసులు వాటిపై దృష్టి సారిస్తే సమాజానికి ఉపయోగమని సీపీఎం నేతలు హితవు పలికారు. శ్యామ్‌పై, నిరుద్యోగులు, సంఘాల నాయకులపై పెట్టిన కేసులను తక్షణం ఉపసంహరించుకోవాలని, జరిగిన పరిణామాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా జరిగిన పోలీసు చర్యపై దీనికి తగిన కారణాలు తెలుసుకోవడానికి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. డీఆర్వోను కలిసిన అనంతరం శ్యామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ యాజమాన్యాన్ని, నిరుద్యోగులను సీపీఎం ప్రతినిధి బృందం పరామర్శించి ధైర్యం చెప్పింది. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు పెద్దింశెట్టి రామకృష్ణారావు, చింతపల్లి అజయ్‌ కుమార్‌, తొట్టిపూడి రాజా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement