సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అకృత్యాలను స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎన్నడూ చూడలేదని, ప్రతిరోజూ పేపర్, టీవీలో కూటమి అరాచకాలే దర్శనమిస్తున్నాయని, వాటిపై పోరాడాల్సిన బాధ్యత ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్త, నేతలపై ఉందని శాసనమండలి ప్రతిపక్ష నేత, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వక్షతన వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తొలుత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి నివాళులర్పించిన అనంతరం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ రానున్న రోజుల్లో వైఎస్సార్‌సీపీదే గెలుపని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తంగా ఉండాలన్నారు. ప్రతి స్థానంలో పోటీ చేసి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఇంకో రెండేళ్లలో కూటమికి ఓటమి ఖాయమని, మరోసారి జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, మన హయాంలో ప్రజలకు మంచి పాలన అందిద్దామని ఆయన చెప్పారు.
డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులా?
డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నించినందుకు కూటమి ప్రభుత్వం తమపై కేసులు పెడుతోందని, కేసులను తేల్చుకుంటామని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. టెట్ ఎన్నిసార్లయినా రాసుకోవచ్చని చంద్రబాబు, లోకేష్ ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారన్నారు. టెట్ రాయకుండా టీచర్ ఉద్యోగం ఇవ్వొచ్చా లేదా అనే విషయంపై సమాధానం చెప్పడం లేదని దుయ్యబట్టారు. పురుషోత్తపట్నం నుంచి నీళ్లు తోడి పోలవరం కాలువలో వదులుతారా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నాణ్యత కోసం విదేశీ నిపుణులు ఏం చెప్పారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అపర భగీరథుడు అంటే గుర్తువచ్చే పేరు మహానేత వైఎస్సార్ అని చెప్పారు. రాబోయేది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమేనని, కష్టపడిన కార్యకర్తలు, నేతలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారని తెలిపారు. సమావేశంలో కాకినాడ పార్లమెంట్ పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు, రాష్ట్ర కార్యదర్శి ఒమ్మి రఘురాం, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, కుడా మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రాన్ని దోచుకోవడమే వారి అజెండా
టీడీపీ అకృత్యాలపై పోరాడాల్సిన
బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం
కష్టపడిన వారికి
వైఎస్సార్ సీపీలో సముచిత స్థానం
శాసనమండలి
ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ
స్థానిక ఎన్నికల్లో గెలుపుపై
కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం


