కాయ్‌ రాజా కాయ్‌ | - | Sakshi
Sakshi News home page

కాయ్‌ రాజా కాయ్‌

Sep 8 2026 12:23 AM | Updated on Sep 8 2026 12:23 AM

జిల్లాలో జోరుగా పేకాట

కూటమి నేతలు, ప్రజాప్రతినిధుల

అండదండలతో నిర్వహణ

రూ.లక్షల్లో పందేలు కాస్తున్న జూదరులు

కట్టడి చేయడంలో అధికారులు విఫలం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: జూదం జడలు విప్పుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ జిల్లావ్యాప్తంగా అనధికార పేకాట శిబిరాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. ఇతర ప్రాంతాలు, పట్టణాలు, నగరాల నుంచి జూదరులను తీసుకొచ్చి మరీ ఆడిస్తున్నారు. శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో ఈ జూదక్రీడ మరింత జోరుగా సాగుతోంది. ప్రతి రోజూ రూ.కోట్లలో చేతులు మారుతున్నాయి. టీడీపీ నేతలు, కూటమి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ఈ అడ్డగోలు వ్యవహారం జరుగుతూండటంతో అడ్డుకునేందుకు ఎవ్వరూ సాహసించడం లేదు. విషయం తెలిసినా పోలీసులు చూసీ చూడనట్లు వ్యహరిస్తున్నారనే విమర్శలున్నాయి. పైగా, కొంత మంది పోలీసులు ఆమ్యామ్యాలు దండుకుంటున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. తద్వారా పేకాట స్థావరాల నిర్వహణకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు విమర్శలున్నాయి. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం పేకాటపై ఉక్కుపాదం మోపింది. పేకాట క్లబ్బులను మూయించివేసింది. కూటమి ప్రభుత్వం మాత్రం ఈ అసాంఘిక క్రీడకు గేట్లు తెరిచేయడంతో పరిస్థితి శ్రీఆడిందే ఆట.. పాడిందే పాటశ్రీగా మారింది.

ఎక్కడెక్కడంటే..

● కాకినాడ నగరంలో కల్పన వంతెన, అన్నమ్మ ఘాటీ సెంటర్‌, దుమ్ములపేట, సంతచెరువు, ఎంఎస్‌ఎన్‌ చారిటీస్‌ కళాశాల వెనుక ప్రాంతం, మహాలక్ష్మి నగర్‌, బీచ్‌ రోడ్డు, సూర్యారావుపేట, ఏడీబీ రోడ్డు తదితర ప్రాంతాల్లో అనధికారిక పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. ప్రతి రోజూ ఇక్కడ రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయని తెలుస్తోంది. పోలీసులు ప్రతి నిత్యం ఈ ప్రాంతాల్లో దాడులు చేస్తున్నా.. జూదాలను మాత్రం అదుపు చేయలేకపోతున్నారు.

● కాకినాడ రూరల్‌లో శశికాంత్‌ నగర్‌, సురేష్‌ నగర్‌, రాయుడుపాలెం, రమణయ్యపేట, వలసపాకల, గుడారిగుంట తదితర ప్రాంతాల్లో కూటమి నేతల కనుసన్నల్లో పేకాట యథేచ్ఛగా సాగుతోంది. రాయుడుపాలెంలోని ఓ భవంతిలో పేకాట భారీగా స్థాయిలో జరుగుతోంది. ఇక్కడ ప్రముఖులు కూడా ఆడుతున్నారని, ప్రతి రోజూ రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయని సమాచారం. దీనిని టీడీపీ నేతలే నిర్వహిస్తూండటంతో పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

● తుని నియోజకవర్గం తేటగుంట, కోటనందూరు, తొండంగి మండలంలో కోడిపందేలు, పేకాట, బెండపూడి తదితర ప్రాంతాల్లో అనధికారిక జూదం జరుగుతున్నాయి. ఇదంతా టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతోంది. దీంతోపోలీసులు తూతూమంత్రంగా హడావుడి చేయడానికే పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా ఇక్కడ జూదక్రీడీలను నియంత్రించలేకపోతున్నారు.

● పెద్దాపురం నియోజకవర్గం మేడపాడు, వేట్లపాలెం, పెదబ్రహ్మదేవం తదితర ప్రాంతాల్లోని పంట పొలాల్లో పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. పండగలు, ఆదివారాల్లో ఇక్కడ జూడక్రీడలకు అడ్డూ అదుపూ ఉండటం లేదు.

పేద బతుకులతో పేకాట

విచ్చలవిడిగా సాగుతున్న జూదక్రీడ పేద, మధ్య తరగతి ప్రజల బతుకులతో శ్రీపేకాటశ్రీ ఆడుకుంటోంది. జూద వ్యసనానికి బానిసలైన కొంత మంది రోజంతా చెమటోడ్చి సంపాదించిన డబ్బును జూద క్రీడలకు తగలేస్తున్నారు. ఆటలో ఓటమి చెంది డబ్బు పోగొట్టుకుంటున్నారు. తిరిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకునే ఆశతో అప్పులు చేస్తున్నారు. చివరకు ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తిరిగి పాత రోజులు తీసుకువస్తోందని మహిళలు ఆవేదన చెందుతున్నారు.

దాడులు చేస్తున్నా..

పేకాట కేంద్రాలపై పోలీసులు అప్పుడప్పుడు దాడులు చేస్తున్నా.. ఎక్కువగా చిన్న స్థాయి నిర్వాహకులు లేదా ఆడేవారి పైనే కేసులు నమోదు చేస్తున్నారనే విమర్శలున్నాయి. అసలు శిబిరాల వెనుక ఉన్న కీలక వ్యక్తులపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని, అందువల్లనే ఈ జూదక్రీడాకు అడ్డుకట్ట పడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నిర్వాహకులుగా ఉన్న పెద్ద నాయకులు ఆయా పోలీసు స్టేషన్లకు నెలవారీ మామూళ్లు ముట్టజెబుతూ, తమ జోలికి రాకుండా చూసుకుంటున్నారనే వాదనలు కూడా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement