ప్రదక్షిణ పదేపదే | - | Sakshi
Sakshi News home page

ప్రదక్షిణ పదేపదే

Sep 8 2026 12:23 AM | Updated on Sep 8 2026 12:23 AM

పీజీఆర్‌ఎస్‌కు పదేపదే విన్నపాలు

అయినా ఫలితం లేదంటున్న ప్రజలు

సమస్య పరిష్కారమవక అవస్థలు

పింఛను ఇవ్వాలి

మా కుమారుడికి చిన్నతనం నుంచీ ఎదుగుదల లేదు. మాట్లాడలేడు, నడవలేడు. పింఛను కోసం రెండేళ్లుగా దరఖాస్తు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం మా అబ్బాయికి ఎనిమిది సంవత్సరాల వయస్సు. పింఛను ఇచ్చి ఆదుకోవాలి – నాగిరెడ్డి మంజుల

కత్తిపూడి శంఖవరం మండలం

ఆన్‌లైన్‌లో నా భూమి తొలగించారు

మా గ్రామంలో మాకు రెండెకరాల భూమి ఉంది. వాస్తవానికి నా భూములు పోలవరం కాలువలో సమీపంలో కూడా లేవు. అయినప్పటికీ నా భూమి పోలవరం కాలువలో పోయిందని పేర్కొంటూ అధికారులు ఆన్‌లైన్‌లో తొలగించారు. ఎన్నిసార్లు విన్నవించుకుంటున్నా ఆన్‌లైన్‌లో నమోదు చేయడం లేదు. రెండేళ్లుగా తిరుగుతూనే ఉన్నాను.

– ఎరికిరెడ్డి చంద్రరాయుడు,

కొడవలి, గొల్లప్రోలు మండలం

నా భూమి పక్కవారి

పొలంలో కలిపేశారు

మా గ్రామంలో నాకు నాలుగున్నర సెంట్ల కొబ్బరి తోట ఉంది. ఇది మా తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమి. దాని పక్కనే ఉన్న రైతు పొలంలో నా భూమిని అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. దీంతో, ఆ భూమి తమదేనంటూ పక్క రైతు గొడవ పెడుతున్నారు. ఆరు నెలలుగా తిరుగుతూనే ఉన్నా అధికారులు స్పందించడం లేదు.

– వంకాయల వీర వెంకట సూర్య సుబ్రహ్మణ్యం, పి.మల్లవరం, తాళ్లరేవు మండలం

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో వివిధ సమస్యలపై అర్జీలు అందిస్తున్నా పరిష్కారానికి మాత్రం నోచడం లేదని ప్రజలు వాపోతున్నారు. సమస్య చిన్నదైనా పరిష్కరించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కార్యాలయాల్లో ఇచ్చిన అర్జీలకు అధికారులు స్పందించకపోవడంతో దూర ప్రాంతమైన కాకినాడ వచ్చి అర్జీలు ఇవ్వాల్సి వస్తోందని, అయినప్పటికీ సరైన న్యాయం జరగడం లేదని ఆవేదన చెందుతున్నారు. కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. పింఛన్లు, రేషన్‌ కార్డులు, ఉపాధి, ఉద్యోగాల కల్పన, ఇళ్లు, ఇళ్ల స్థలాల మంజూరు, భూ సమస్యలు, రీసర్వే, ఆన్‌లైన్‌లో భూ రికార్డుల నమోదు, తాగునీరు, పారిశుధ్యం, మురుగు కాలువల్లో పూడికల తొలగింపు, సదరం సర్టిఫికెట్ల మంజూరు, రోడ్లు, ప్రభుత్వ పథకాల లబ్ధి తదితర సమస్యలపై అర్జీలు సమర్పిస్తున్నారు. ఆ సందర్భంగా అధికారులు ఇస్తున్న హామీలు విని, తమ సమస్య పరిష్కారమైపోతుందని సంబరపడుతూ ఇంటిముఖం పడుతున్నారు. కానీ, రోజులు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉండటంతో అసంతృప్తి చెందుతున్నారు. అర్జీదారుల సమస్యలను క్షేత్ర స్థాయిలో సమగ్రంగా పరిశీలించి, వారు సంతృప్తి చెందేవిధంగా పరిష్కరించాలని కలెక్టర్‌ పదేపదే ఆదేశిస్తున్నా ప్రయోజనం ఉండటం లేదని అంటున్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో సమగ్రంగా పరిశీలించకుండానే సమస్య పరిష్కరించినట్లు చెబుతున్నారని వాపోతున్నారు. కలెక్టరేట్‌లో ఈ సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ప్రజలు 311 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌, జాయింట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌, ఇతర అధికారులు అర్జీలు స్వీకరించారు.

కౌలు రైతులకు రుణాలివ్వడం లేదు

ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ రుణాలు ఇవ్వకపోవడంతో కౌలు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కౌలు కార్డులు ఇచ్చినా ఏ బ్యాంకులోనూ రుణాలు ఇవ్వడం లేదు. దీంతో, పంట పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు కౌలు రైతులు అప్పు తెచ్చుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి, కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలి.

– ఎం.రాజశేఖర్‌, కౌలు రైతుల సంఘ జిల్లా కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement