బాంబుల మోతతో హడల్‌ | - | Sakshi
Sakshi News home page

బాంబుల మోతతో హడల్‌

Sep 8 2026 12:23 AM | Updated on Sep 8 2026 12:23 AM

పచ్చని పొలాల్లో

ఉన్నట్టుండి పేలుడు శబ్దాలు

ఉలిమేశ్వరం,

తిరుపతి గ్రామాల్లో ఆందోళన

ఓఎన్‌జీసీ కార్యకలాపాలేనని నిర్ధారణ

ఊపిరి పీల్చుకున్న

రెండు గ్రామాల ప్రజలు

పెద్దాపురం: మండలంలో నిత్యం ప్రశాంత వాతావరణంలో ఉండే ఉలిమేశ్వరం – తిరుపతి గ్రామాల నడుమ.. పచ్చని పొలాల్లో.. సోమవారం సాయంత్రం ఉన్నట్టుండి పెద్ద పెట్టున వినిపించిన బాంబుల శబ్దాలు స్థానికులను హడలెత్తించాయి. ఏలేరు ప్రధాన కాలువను ఆనుకుని ఉన్న పంట పొలాల్లో ఒక్కసారిగా వరుసగా పేలుళ్ల శబ్దాలు రావడంతో ఆ గ్రామాల్లో కలకలం రేగింది. ఏం జరిగిందోనని ఆ రెండు గ్రామాల ప్రజలు హడలెత్తారు. శబ్దాలు వస్తున్న వైపు పరుగుపరుగున వెళ్లారు. అక్కడ పొలాల్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు భూమిలో పేలుడు పదార్థాలు పెట్టి పేల్చుతున్నట్లు కనిపించడంతో ఆందోళన చెంది, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, పెద్దాపురం పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఆరా తీశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓఎన్‌జీసీ కాంట్రాక్టు సంస్థ ఈ ప్రాంతంలో రిగ్గు వేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇక్కడి భూగర్భంలో చమురు, సహజవాయువు నిక్షేపాలున్నట్టు స్థానిక అధికారులు గుర్తించారని, దాని కోసం మట్టి నమూనాలు సేకరించడానికే పేలుడు పదార్ధాలు వాడామని ఓఎన్‌జీఎస్‌ అధికారులు వెల్లడించారు. దీంతో, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ముందస్తు సమాచారం లేకుండానే..

అయితే, సాధారణంగా ఎక్కడైనా చమురు అన్వేషణ కార్యకలాపాలు చేపడితే, ముందుగానే ఆ ప్రాంతాల వారికి ముందుగా సమాచారం ఇస్తారు. స్థానికులను అధికారులు అప్రమత్తం చేస్తారు. కానీ, ఉలిమేశ్వరం, తిరుపతి గ్రామాల ప్రజలకు ఆవిధంగా సమాచారం ఇవ్వకుండానే చమురు అన్వేషణకు సర్వే ప్రారంభించడం ఈ ఆందోళనకు కారణమైంది. సంబంధిత కాంట్రాక్టు సంస్థ తీరుపై ఉలిమేశ్వరం గ్రామస్తులు మండిపడ్డారు. సమాచారం ఇవ్వకుండా పనులు ఏవిధంగా మొదలు పెడతారంటూ ఆ సంస్థ సిబ్బందిని నిలదీశారు. అయితే, రిగ్గు వేస్తున్న ఆ సంస్థ సిబ్బందికు ఇక్కడి భాష రాకపోవడంతో అంతా గందరగోళ వాతావరణం ఏర్పడింది. చివరకు అధికారులు వచ్చి, సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. మొత్తం మీద ఉలిమేశ్వరం, తిరుపతి, చదలాడ, కాండ్రకోట తదితర గ్రామాల్లో భూగర్భంలో చమురు, సహజవాయువు నిక్షేపాలున్నట్లు ప్రచారం ఊపందుకుంది.

ఓఎన్‌జీసీ కాంట్రాక్టు సంస్థ సిబ్బందిని

నిలదీస్తున్న ఉలిమేశ్వరం గ్రామస్తులు

బాంబు పేలుడు ధాటికి పొలంలో

లోతుగా ఏర్పడిన గొయ్యి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement