బాలాజీచెరువు (కాకినాడ సిటీ): విద్యార్థినులపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు ఉపాధ్యాయులకు ఉద్వాసన పలికినట్లు జిల్లా విద్యా శాఖ అధికారి పిల్లి రమేష్ సోమవారం తెలిపారు. ఏలేశ్వరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పీఎస్ ఉపాధ్యాయుడు శ్రీరెడ్డి శ్రీనివాసరావు, ఉప్పాడ కొత్తపల్లి మండలం మూలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీఎస్ ఉపాధ్యాయుడు జోగా సురేష్‌లను విధుల నుంచి తొలగించామని తెలిపారు.
అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్‌గా
రమేష్‌బాబు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్‌గా ఎన్.రమేష్‌బాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్‌టీఆర్ జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తూ పదోన్నతిపై ఆయన ఇక్కడకు వచ్చారు. ఇప్పటి వరకూ ఇక్కడ జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్‌గా పని చేసిన నందాజీ గత నెలలో ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో రమేష్ నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌ను, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
వంద శాతం లక్ష్యాలు
సాధించాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా అధికారులు ప్రతి అంశంలోనూ వంద శాతం లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్‌తో కలసి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, క్షేత్ర స్థాయి సిబ్బందితో కలెక్టరేట్ నుంచి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల వారీగా ప్రాధాన్య అంశాల పురోగతిపై సమీక్షించారు. రీ–సర్వే 4,5 దశల పురోగతి, పీఓడీ సబ్ డివిజన్ అసైన్మెంట్ ప్రక్రియలను గడువులోగా పూర్తి చేసి ఆన్‌లైన్‌లో సమర్పించాలని ఆదేశించారు. ప్రతి నెలా 2 నుంచి 9వ తేదీ వరకూ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేపట్టాలన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా హియరింగ్, బుక్ ఏ కాల్ ఫిర్యాదుల విచారణ త్వరగా పూర్తి చేసి, తుది ప్రచురణకు సిద్ధం చేయాలని సూచించారు. విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణాలకు తహసీల్దార్లు స్థలాలను ఎంపిక చేసి, పంచాయతీరాజ్ ఏఈలకు అప్పగించాలన్నారు. స్థలాలు లేని చోట దాతలు లేదా జలవనరుల శాఖ భూములను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు.


