అన్నవరం: అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి రథసేవ ఆదివారం ఆలయ ప్రాకారంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేదపండితుల మంత్రోచ్ఛాటన మధ్య టేకు రథంపై ప్రతిష్ఠించి తూర్పు రాజగోపురం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ అర్చకుడు సుధీర్, పరిచారకుడు గణేష్ తదితరులు స్వామి అమ్మవార్లకు హారతి ఇచ్చారు. మూడుసార్లు ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారిని ఆలయానికి చేర్చారు. ట్రస్ట్ బోర్డు గౌరవ సలహాదారులు ఎం.సత్యప్రసాద్, ఎంఎస్ రెడ్డి, ఆలయ ఏఈవో భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


