మామూళ్ల కోసం ఒత్తిళ్లు
ఆలయ కమిటీ సభ్యులకు సాధారణంగా గౌరవ వేతనం ఉండదు. అయినా కొందరు సభ్యులు తమకు నెలవారీగా నిర్దిష్ట మొత్తంలో మామూళ్లు ఇవ్వాలని ఈవోలపై పట్టుబడుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశామని, తమకు ఏదైనా రావాలని చెబుతూ ఒత్తిడి చేస్తున్నారు. కొన్నిచోట్ల నెలకు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. కాకినాడ జిల్లా కేంద్రంలోని ఒక సత్రానికి సంబంధించిన కమిటీ సభ్యులు నెలకు రూ.5 వేల చొప్పున ఇవ్వాలని సంబంధిత అధికారిపై ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తాను నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు ఇవ్వలేనని, అలా చేస్తే ఉద్యోగానికే ప్రమాదం ఏర్పడుతుందని సంబంధిత అధికారి చెప్పినప్పటికీ ఒత్తిళ్లు కొనసాగుతున్నట్టు సమాచారం.
● మాట వినకుంటే బదిలీ చేస్తామంటూ బెదిరింపులు
● నెలనెలా మామూళ్లు ఇవ్వాలంటూ
వేధింపులు
● ఆలయాలు, సత్రాల్లో కమిటీ సభ్యుల పేరుతో అధికారులపై ఒత్తిళ్లు
● తలలు పట్టుకుంటున్న ఈవోలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లావ్యాప్తంగా అనేక దేవాలయాలు, సత్రాలకు నూతన పాలక మండళ్లు, కమిటీ సభ్యులను నియమించారు. జిల్లాలో 526 ఆలయాలు, 83 సత్రాలు ఉన్నాయి. ఇటీవల కమిటీ సభ్యులుగా నియమితులైన కొందరు రాజకీయ నాయకులు, కార్యకర్తలు తమ పరిధిని దాటి ఆలయాలు, సత్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. తమ మాట వినకపోతే బదిలీలు చేయిస్తామని, ఇబ్బందులు తప్పవంటూ ఈవోలు, సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి దేవాలయాల పాలనలో కమిటీ సభ్యులకు నిర్దిష్ట బాధ్యతలు ఉన్నప్పటికీ, రోజువారీ పరిపాలన, అధికారిక ఆర్థిక వ్యవహారాలు దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం సంబంధిత అధికారుల పరిధిలోనే ఉంటాయి. కొందరు కమిటీ సభ్యులు మాత్రం ఇక్కడ పెత్తనం మాదే.. మా మాటే వినాలి.. అన్న ధోరణితో వ్యవహరిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఆలయాల్లో చిన్నపాటి ఖర్చు చేయాలన్నా తమ అనుమతి తీసుకోవాలని, తమకు తెలియకుండా ఎలాంటి నిర్ణయాలూ తీసుకోకూడదని కొందరు కమిటీ సభ్యులు ఈవోలపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. తమ మాట వినకుంటే ఉన్నత స్థాయి నాయకులతో మాట్లాడి బదిలీ చేయిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పలువురు ఈవోలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు తెలుస్తోంది. అధికారికంగా లెక్కల్లో చూపలేని ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి వస్తే ఏం చేయాలో తెలియక వారు ఆందోళన చెందుతున్నారు.
ఆలయాల్లో రోజంతా మకాం
కొందరు కమిటీ సభ్యులు ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయాలు, సత్రాల్లోనే మకాం వేస్తూ ఫ్యాన్లు, ఏసీలు వినియోగించడం, టిఫిన్లు, భోజనాలు తెప్పించుకోవడం, ప్రసాదాలు ఇవ్వాలని సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారని తెలిసింది. తమతో పాటు బంధువులను కూడా తీసుకొచ్చి ప్రసాదాలు, భోజనాల కోసం ఇబ్బందులు కలిగిస్తున్నారని సమాచారం. శ్రావణ శుక్రవారాల సందర్భంగా జిల్లాలోని పలు ఆలయాల్లో నిర్వహించిన సామూహిక వరలక్ష్మీ వ్రతాల్లో కూడా కమిటీ సభ్యులు అంతా తామై వ్యవహరించారు. పాసుల పంపిణీలో తమ అనుచరులు, బంధువులు, రాజకీయ నాయకులకు ప్రాధాన్యం ఇచ్చి, సాధారణ భక్తులను అసలు పట్టించుకోలేదు. పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి దేవస్థానం, కాకినాడ బాలాత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వరస్వామి దేవస్థానం, దేవాలంవీధిలోని భీమేశ్వరస్వామి ఆలయంలో సాధారణ భక్తులను అసలు పట్టించుకోకుండా తమకు కావాల్సినవారికి ఆయా ఆలయ కమిటీ సభ్యులు పాస్‌లు పంపిణీ చేశారు. తమ మాట వినకుంటే బదిలీ చేయిస్తామంటూ బెదిరింపులకు దిగుతుండటంతో ఈవోలు మౌనంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. అధికారిక విధులు నిర్వహించాలా, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గాలా అన్న సందిగ్ధ పరిస్థితిలో వారు పనిచేస్తున్నారని దేవదాయ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఇటీవల దేవాదాయ శాఖ అధికారి వద్ద ఒక ఈవో తమ బాధను చెప్పుకోగా, ఆయా కమిటీ సభ్యులపై అధికారికంగా ఫిర్యాదు చేస్తే నివేదికను దేవదాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సంబంధిత కమిటీని రద్దు చేయిస్తామని హామీ ఇచ్చారు. అలా చేస్తే తనపై కక్షసాధింపులుకు పాల్పడి ఇబ్బందులు పెడతారని ఆ ఈవో ఫిర్యాదు చేసేందుకు నిరాకరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
భక్తికి, భగవదారాధనకు నిలయాలుగా ఉండే ఆలయాల్లో పలువురు నేతలు తిష్ట వేసి.. అక్కడి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. ఆలయ అధికారులు, సిబ్బందిపై పెత్తనం చెలాయిస్తూ.. తమ మాట వినకుంటే బదిలీ చేయిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. నెలనెలా మామూళ్లు ఇవ్వాలంటూ వేధింపులకు పాల్పడుతున్నారు. మరికొందరైతే మరీ బరితెగించి.. హుండీ ఆదాయంలో ఖర్చుల పేరిట తమకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. దీంతో ఈవోలు తలలు పట్టుకుంటున్నారు.
హుండీ ఆదాయంలోనూ వాటా ఇవ్వాలట!
మరికొన్ని ఆలయాల్లో హుండీ ఆదాయం లెక్కించే సమయంలో కొంత నగదును ఖర్చుల పేరుతో పక్కన పెట్టాలని కమిటీ సభ్యులు సూచిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం అది సాధ్యం కాదని ఈవోలు స్పష్టం చేయడంతో వారి మధ్య విభేదాలు తలెత్తుతున్నట్టు సమాచారం. ఆదాయం అధికంగా వచ్చే పెద్ద ఆలయాల్లో పరిస్థితి ఒకలా ఉండగా ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్న చిన్న ఆలయాలు, సత్రాల్లో మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి ఇవ్వాలంటూ ఈవోలు కమిటీ సభ్యుల వద్ద మొరపెట్టుకునే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. అయినప్పటికీ తమకు డబ్బులు ఇవ్వాల్సిందేనని కొందరు పట్టుబడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.


