ఇక జెడ్పీకి కొత్త రూపు! | - | Sakshi
Sakshi News home page

ఇక జెడ్పీకి కొత్త రూపు!

Sep 6 2026 12:25 AM | Updated on Sep 6 2026 12:25 AM

నాలుగుగా విడిపోనున్న

ఉమ్మడి జిల్లా పరిషత్‌

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఎన్నో దశాబ్దాల రాజకీయ చరిత్రకు వేదికగా నిలిచిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ ఇప్పుడు నాలుగు జిల్లాల పరిధిలోకి విభజన కానుంది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ పరిధిలో నాలుగు వేర్వేరు జిల్లా పరిషత్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత జిల్లా పరిషత్‌ పాలకవర్గ గడువు ఈ నెల 24 వరకు ఉంది. ఆ తర్వాత ఆయా కొత్త జిల్లాల పరిధిలో జిల్లా పరిషత్‌ల ఏర్పాటు ప్రక్రియ అమల్లోకి వచ్చే అవకాశముంది. కొత్త పరిపాలనా వ్యవస్థకు అనుగుణంగా జిల్లా పరిషత్‌ల నిర్వహణ కోసం అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విస్తీర్ణం, జనాభా, పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని గతంలో జిల్లాల విభజన జరిగింది. దీంతో ఒకే జిల్లా పరిషత్‌ పరిధిలో కొనసాగిన స్థానిక సంస్థల వ్యవస్థ ఇప్పుడు నాలుగు జిల్లాలుగా విడిపోనుంది. కాకినాడ, తూర్పుగోదావరి, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పోలవరం జిల్లా పరిషత్‌లుగా రూపాంతరం చెందనున్నాయి. ఆయా జిల్లాలకు ప్రత్యేకంగా జిల్లా పరిషత్‌ వ్యవస్థలు ఏర్పడటం ద్వారా స్థానిక పరిపాలన మరింత వికేంద్రీకరణ అవుతుందని భావిస్తున్నారు. కొత్త జిల్లా పరిషత్‌ల పరిపాలన కోసం జెడ్పీ సీఈవోతో పాటు ఇతర పరిపాలనా అధికారుల నియామకానికి కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దశాబ్దాలుగా కొనసాగిన ఉమ్మడి జిల్లా పరిషత్‌ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.

రాజకీయ నాయకులకు

నర్సరీగా ఉమ్మడి జెడ్పీ

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ కేవలం స్థానిక సంస్థ మాత్రమే కాదు, రాష్ట్ర, జాతీయ రాజకీయాలకు అనేక మంది ప్రముఖ నాయకులను అందించిన రాజకీయ వేదికగా కూడా గుర్తింపు పొందింది. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవిలో పనిచేసిన పలువురు నాయకులు అనంతరం రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీలక పదవులను అధిరోహించారు. ఈ జాబితాలో ప్రముఖంగా గుర్తుకొచ్చేది జీఎంసీ బాలయోగి. జిల్లా పరిషత్‌ రాజకీయాల నుంచి ఎదిగి దేశ అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఒకటైన లోక్‌సభ స్పీకర్‌గా సేవలందించి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. వంగా గీత కూడా జిల్లా పరిషత్‌ రాజకీయాల నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన నాయకుల్లో ఒకరు. ఆమె రాజ్యసభ సభ్యురాలిగా, అనంతరం పార్లమెంట్‌ సభ్యురాలిగా సేవలందించారు. ఉమ్మడి జిల్లా పరిషత్‌ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసి రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత పొందారు. భాస్కర రామారావు వంటి నాయకులు కూడా ఉన్నత స్థాయి పదవులను అధిరోహించారు. ఆయన ప్లానింగ్‌ బోర్డు వైస్‌ చైర్మన్‌గా పనిచేయడం ఉమ్మడి జెడ్పీ రాజకీయ ప్రస్థానానికి ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. కొత్తగా ఏర్పడనున్న నాలుగు జిల్లా పరిషత్‌లు స్థానిక సంస్థల రాజకీయాల్లో ఎలాంటి కొత్త నాయకత్వాన్ని తీర్చిదిద్దుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement