బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ మూడో దఫా సమావేశం కమిటీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపాదించిన దరఖాస్తులపై కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులతో పరిశీలించి సూచనలు ఇచ్చారు. అర్హులైన జర్నలిస్టులపై సమావేశంలో చర్చించి నిర్ణయిస్తామన్నారు.
కారు, ఆటో ఢీ : నలుగురికి గాయాలు
కొత్తపల్లి: బీచ్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన కారును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు శనివారం ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డులో ఎస్పీజీఎల్ సమీపంలో అతి వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. ఇద్దరు కాకినాడ, మరో ఇద్దరు పిఠాపురం ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. కారు డ్రైవరు అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదానికి కారణమైన కారును అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
వాహనం అదుపుతప్పి యువకుడి మృతి
తాళ్లరేవు: గాడిమొగ రహదారిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్లాడి వెంకట కాశి (23) దుర్మరణం పాలయ్యాడు. కోరంగి పోలీసులు తెలిపిన వివరాల మేరకు యానాం సావిత్రినగర్‌కు చెందిన కాశి చేపలవ్యాపారం చేస్తుంటాడు. రోజూ మాదరిగానే ద్విచక్రవాహనంపై మట్లపాలెం మార్కెట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా గాడిమొగ రిలయన్స్ కంపెనీ వద్ద మలుపులో ప్రమాదవశాత్తూ అదుపుతప్పి పడిపోయాడు. దీంతో కాశి తలకు తీవ్రగాయమై రక్తస్రావమైంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. చేతికి అందివచ్చిన కుమారుడు అర్ధాంతరంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. కోరంగి ఎస్‌ఐ పి.సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కారు ఢీకొని..
రాజానగరం: రోడ్డుపై నడచి వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. జాతీయ రహదారిపై దివాన్‌చెరువు పండ్ల మార్కెట్ సమీపంలో శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన బొమ్మూరు సీఐ పి.కాశీవిశ్వనాథ్ తెలిపిన వివరాలిలావున్నాయి. ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని రాజమహేంద్రవరంలోని సుబ్బారావుపేటకు చెందిన మారేడుపూడి విశ్వేశ్వర శ్రీనివాసాచార్యులు (49) గా గుర్తించామన్నారు. అలాగే అతనిని ఢీ కొట్టి ఆగకుండా వెళ్లిపోయిన కారును కూడా గుర్తించి, పట్టుకున్నామని చెప్పారు. కేసును ఎస్సై కె.రమేష్ దర్యాప్తు చేస్తున్నారు.
వాహనం ఢీకొని..
అమలాపురం రూరల్: చిందాడగరువు బైపాస్ రోడ్డులో శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి గాయపడి అమలాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తాలూకా ఎస్సై చైతన్యకుమార్ తెలిపారు. రోళ్లపాలెం గ్రామానికి చెందిన జల్లి ప్రసాద్ (40) మోటార్ సైకిల్‌పై బైపాస్ రోడ్డులో వెళ్తుండగా వెనుక నుంచి అశోక్ లేలాండ్ వాహనం వేగంగా వచ్చి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని హుటాహుటిన అమలాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రసాద్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.
22 కిలోల గంజాయి స్వాధీనం
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురు అంతరాష్ట్ర వ్యక్తులతో పాటు ఒక స్థానికుడిని ప్రకాశం నగర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎస్పీ డి.నరసింహకిశోర్ ఆదేశాల మేరకు ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్, సంబంధిత పోలీసు అధికారుల పర్యవేక్షణలో సీఐ ఆర్‌ఎస్.బాజీలాల్, ఎస్సైలు జి.సతీష్, ఎస్‌ఐ కె.నవీన్ కుమార్ గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెట్టారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఏవీ అప్పారావు రోడ్డులోని స్కాచ్ బ్యారెల్ సమీపంలో ఐదుగురు నిందితులను వారు అదుపులోకి తీసుకుని 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు జాఫర్ చీకు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అదుపులోకి తీసుకున్న వారిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన రహత్ అలీ, హర్యానా రాష్ట్రానికి చెందిన ఇర్ఫాన్, సుమిత్ కుమార్ మిశ్రా, బీహార్‌కు చెందిన సందీప్ కుమార్, రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన షేక్ సాధక్ అలీ ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో కిర్లంపూడి వాసి మృతి
కొణిజర్ల: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో కాకినాడ జిల్లా కిర్లంపూడి చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల పరిషత్ కార్యాలయం సమీపంలో శనివారం జరిగిన ఈ ఘటనలో కిర్లంపూడి మండలం ముక్కొల్లు గ్రామానికి చెందిన మల్లా మురళీకృష్ణ (31) రైస్ మిల్లు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. వీఎం బంజరలోని ఓ మిల్లులో మరమ్మతులు చేసిన ఆయన హైదరాబాద్ బస్సు ఎక్కేందుకు ద్విచక్ర వాహనంపై బొద్దపు శివకుమార్‌తో కలిసి బయలుదేరాడు. కొణిజర్ల మండల పరిషత్ కార్యాలయం సమీపాన శివకుమార్ మూత్ర విసర్జన కోసం దిగగా మురళీకృష్ణ ద్విచక్ర వాహనాన్ని రోడ్డుపైకి తీసుకువచ్చే క్రమంలో వైరా వైపు నుంచి ఖమ్మం వైపు వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఘటననలో తలకు తీవ్రగాయాలైన మురళీకృష్ణను ఖమ్మం తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు కొణిజర్ల ఎస్సై జి.సూరజ్ వెల్లడించారు.


