చీరల పంపిణీ పేరుతో.. చీటింగ్‌! | - | Sakshi
Sakshi News home page

చీరల పంపిణీ పేరుతో.. చీటింగ్‌!

Sep 5 2026 12:20 AM | Updated on Sep 5 2026 12:20 AM

చీటీలు ఇచ్చారు..

చీరలు ఎత్తుకెళ్లారంటూ ఆందోళన

జనసేన నేతల తీరుపై మండిపడిన మహిళలు

పవన్‌ ఇలాకాలో రసాభాసగా

వరలక్ష్మీ వ్రతాల నిర్వహణ

పిఠాపురం: చీటీలు ఇచ్చారు.. చీరలు ఇస్తామన్నారు.. చివరకు చీరలు లేవంటూ చేతులెత్తేశారు.. తద్వారా మండుటెండలో గంటల తరబడి క్యూలో పడిగాపులు పడిన మహిళలకు చుక్కలు చూపించారు.. దీంతో, వారు జనసేన నాయకులకు శాపనార్థాలు పెట్టారు. దీంతో, పాదగయ క్షేత్రంలో జనసేన నాయకులు ఆర్భాటంగా నిర్వహించ తలపెట్టిన సామూహిక వరలక్ష్మీ వ్రతాలు రసాభాసగా మారాయి.

ఏం జరిగిందంటే..

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇలాకా పిఠాపురం పాదగయ క్షేత్రంలో.. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నట్లు జనసేన నాయకులు ప్రకటించారు. పెద్ద సంఖ్యలో మహిళలను రప్పించడానికి ఉచితంగా చీరలు ఇస్తున్నామంటూ ఊరూవాడా ఊదరగొట్టారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఆడపడుచులకు పవన్‌ కల్యాణ్‌ పసుపు, కుంకుమ, 12 వేల చీరలు పంపించారంటూ హడావుడి చేశారు. తొలుత 12 వేల చీరలన్నారు.. తర్వాత 10 వేల చీరలు సిద్ధం చేశామని విస్తృతంగా ప్రచారం చేశారు. చీరల పేరుతో పలువురు మహిళలకు చీటీలు కూడా ఇచ్చారు. దీంతో, ఇటు పుణ్యం దక్కడంతో పాటు అటు చీరలు కూడా పొందవచ్చనే ఆశతో పెద్ద సంఖ్యలో మహిళలు పాదగయకు చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకుని భారీగా బారులు తీరారు.

చీరలు పట్టుకుపోయారు

అయితే, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా జనసేన నాయకులు చివరకు 6 వేల మందికి కూడా చీరలు పంపిణీ చేయలేదు. మరోవైపు అధికారులు కేవలం కొంత మందితోనే వ్రతాలు చేయించారు. మిగిలిన వారికి చీరలు మాత్రమే ఇస్తామని, వ్రతాలు ముగిసిపోయాయని చెప్పారు. దీంతో, అప్పటికే ఇంకా క్యూ లైన్లలో పడిగాపులు పడుతున్న మహిళలు తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు వ్రతాలకు వచ్చిన మహిళల్లో కొంత మందికి మాత్రమే జనసేన నాయకులు చీరలు పంపిణీ చేశారు. అనంతరం, చడీచప్పుడు లేకుండా వారు, ఆలయ అధికారులు బయటకు వెళ్లిపోయారు. దీంతో, సుమారు వెయ్యి మంది మహిళలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ క్యూ లైన్లలో పడిగాపులు పడ్డారు. పవన్‌ కల్యాణ్‌ 12 వేల చీరలు పంపించారని ప్రచారం చేసిన జనసేన నేతలు 6 వేల మందికే వాటిని అందించారని, మిగిలినవి దొడ్డిదారిన పట్టుకుపోయారని మహిళలు ఆరోపించారు. వ్రతం చేసుకునే అవకాశం ఇస్తామని చెప్పడంతో ఆశ పడి వచ్చామని, చివరకు వ్రతాలు చేయించకపోవడంతో పాటు చీరలు కూడా ఇవ్వకుండా పట్టుకుపోతారా అంటూ జనసేన నాయకుల వారు మండిపడ్డారు.

చీరల్లేవ్‌.. చీటీలతో సరి!

పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఆడపడుచులకు మాత్రమే చీరలు అని జనసేన నేతలు ప్రచారం చేయగా.. ఈ వ్రతాలకు వచ్చిన వారిలో మూడొంతులకు పైగా పెద్దాపురం, కాకినాడ రూరల్‌కు చెందిన మహిళలే ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 4 వేల వరకూ మాత్రమే చీటీలు పంపిణీ చేయగా మిగిలినవన్నీ పెద్దాపురం, కాకినాడ రూరల్‌ నేతలు పట్టుకుపోయి, తమ నియోజకవర్గాల్లో పంపిణీ చేసినట్లు పిఠాపురం జనసేన నేతలు, మహిళలు మండిపడుతున్నారు. తమకు చీటీలు తప్ప చీరలు మిగలకపోవడంతో పిఠాపురానికి చెందిన మహిళలు శాపనార్థాలు పెట్టారు. తమకోసం పంపించిన చీరలను ఇతర నియోజకవర్గాల నేతలు ఎలా పట్టుకుపోతారని దుయ్యబట్టారు. ఈ వ్రతాల నిర్వహణకు పెద్దాపురం, కాకినాడ జనసేన నేతలు తప్ప పిఠాపురానికి చెందిన నేతలు పెద్దగా హాజరు కాకపోవడం కొసమెరుపు.

మండుటెండలో ఆపసోపాలు పడుతూ మహిళల పడిగాపులు

గొంతెండిపోతున్నా..

మరోవైపు సామూహిక వ్రతాలకు వచ్చిన భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని పలువురు ఆరోపించారు. విడతల వారీగా వ్రతాలు నిర్వహించడంతో పెద్ద సంఖ్యలో మహిళలు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సి వచ్చింది. ఆ క్యూ లైన్లలో నిలబడి గొంతెండిపోతున్నా.. తాగేందుకు గుక్కెడు మంచినీరు కూడా ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేయలేదు. దీంతో, మహిళా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రసాదాలు సైతం పూర్తిగా అందించలేదంటూ వ్రతాల్లో పాల్గొన్న భక్తులు ఆందోళనకు దిగారు. దీంతో, పాదగయ క్షేత్రంలో ఉద్రిక్తత నెలకొంది.

విరిగిపోయిన బారికేడ్లు

వ్రతాల నిర్వహణకు సంబంధించి చేసిన ఏర్పాట్లలో లోపాలు ఇక్కడకు వచ్చిన మహిళలకు చెమటలు పట్టించాయి. వేలాది మందిని క్యూ లైన్లలోకి వదిలిన కొద్దిసేపటికే బారికేడ్లు విరిగిపోయి, తొక్కిసలాటకు దారి తీసింది. క్యూ లైన్లలో మహిళలు ఉండగానే బారికేడ్లను తిరిగి ఏర్పాటు చేయడానికి అధికారులు చేసిన ప్రయత్నాలు ప్రమాదకరంగా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement