బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): గత ఎన్నికల ముందు ఉద్యోగులకు కూటమి పెద్దలు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సీహెచ్ చిన్న, జీవీ సూరిబాబు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద శుక్రవారం వారు మాట్లాడుతూ, అధికారంలోకి రాగానే మెరుగైన పీఆర్‌సీ, బకాయిలు వెంటనే విడుదల చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారని అన్నారు. ఆ మాట తప్పినందున రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఏపీ జేఏసీ – అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రజాస్వామ్యబద్ధంగా ఐక్య కార్యాచరణ ఉద్యమాలు చేస్తున్నారని చెప్పారు. అటువంటి నాయకుడిపై వీఆర్‌ఓ సంఘం నాయకుడు భూపతిరాజు రవీంద్రరాజు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. న్యాయబద్ధంగా ఉద్యమాలు చేస్తూంటే మద్దతుగా ఉండకపోగా ప్రభుత్వనికి అనుకూలంగా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా న్యాయబద్ధమైన డిమాండ్లతో చేస్తున్న ఉద్యమాలకు మద్దతు ఇచ్చి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఉద్యోగులతో పాటు వీఆర్‌ఓలు కూడా 15 వేల మంది ఉన్నారనే విషయాన్ని గుర్తించి, వ్యవహరించాలని హితవు పలికారు. కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ సాయిరెడ్డి, జిల్లా జేఏసీ వైస్ చైర్మన్ కె.శ్రీనివాస్, నాయకులు కాయల సత్యనారాయణ, నున్న సత్యనారాయణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కె.చిన్నారావు పాల్గొన్నారు.
పెద్దపులి రీ ఎంట్రీ!
గంగవరం: గత ఆరు నెలలుగా ఉమ్మడి తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో సంచరిస్తున్న పెద్దపులి పోలవరం జిల్లా గంగవరం మండలోకి రీ ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. దొరమామిడి, పాత కొత్తాడ అటవీ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం పులి పాదముద్రలను చూసినట్లు గిరిజన రైతులు చెబుతున్నారు. దీనిపై అడ్డతీగల సబ్–డీఎఫ్‌ఓ జేవీ సుబ్బారెడ్డిని సంప్రదించగా.. జిల్లాలోకి పులి ప్రవేశించిందని, ప్రస్తుతం రేడియో ట్రాకింగ్ పని చేయడం లేదని చెప్పారు.
జాతీయ మానవ హక్కుల
సంఘానికి ఫిర్యాదు
రంపచోడవరం: పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో క్లోరోక్విన్ ట్యాబ్లెట్ల వల్ల గిరిజన బాలిక మడివి జమున మరణించడం, కొంత మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘానికి తాను శుక్రవారం ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ డైరెక్టర్ బాలు అక్కిస తెలిపారు. రాష్ట్రంలోని గిరిజన గ్రామాల్లో కొన్ని మలేరియా కేసులు నమోదైన తర్వాత ముందు జాగ్రత్త చర్యగా క్లోరోక్విన్ మాత్రలను పంపిణీ చేయడం చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది. వైద్యుల బృందం సలహా ఇచ్చే వరకూ ఈ ప్రక్రియను నిలిపివేయాలని, వ్యక్తిగతంగా పరీక్షలు నిర్వహించకుండా ముందస్తు క్లోరోక్విన్ మాత్రలు ఇవ్వకూడదని, ముందు జాగ్రత్త చర్యగా ఏజెన్సీలో ఈ మాత్రల వాడకంపై నిర్ణయం తీసుకోవడానికి నిపుణులతో కూడిన ప్రత్యేక వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడిని ఆదేశించాల్సిందిగా విజ్ఞప్తి చేశానని బాలు అక్కిస తెలిపారు.
కోనసీమ రైల్వే ప్రాజెక్టుపై సీఎం
స్పష్టమైన ప్రకటన చేయాలి
అమలాపురం టౌన్: ఈ నెల 9న అంబాజీపేట పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కోనసీమ రైల్వే ప్రాజెక్ట్‌పై స్పష్టమైన ప్రకటన చేయాలని కోనసీమ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ రైల్వే లైన్‌కు 25 ఏళ్ల కిందట అమలాపురంలో శంకుస్థాపన చేసిన ప్రాంతంలో జేఏసీ ప్రతినిధులు శుక్రవారం సమావేశమై, తమ డిమాండ్లపై నినాదాలు చేశారు. జేఏసీ కన్వీనర్ బండారు రామ్మోహనరావు మాట్లాడుతూ, కోనసీమ రైల్వే లైన్‌కు శంకస్థాపన జరిగి రెండున్నర దశాబ్దాలు గడుస్తున్నా పనులు ఇంకా నత్తనడకనే సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రైల్వే లైన్ నిర్మాణం, భూసేకరణపై సీఎం చంద్రబాబుతో పాటు కోనసీమ ప్రజాప్రతినిధులు స్పందించాలని డిమాండ్ చేశారు. జేఏసీ ప్రతినిధులు డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి, కరాటం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


