వరలక్ష్మీ వ్రతాలను రాజకీయ జాతరలా మార్చారు | - | Sakshi
Sakshi News home page

వరలక్ష్మీ వ్రతాలను రాజకీయ జాతరలా మార్చారు

Sep 5 2026 12:20 AM | Updated on Sep 5 2026 12:20 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): కాకినాడ నగరంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ ఆలయాలు రాజకీయ వేదికలుగా మారాయని భోగి గణపతి పీఠం వ్యవస్థాపకుడు దూసర్లపూడి రమణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పీఠంలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నగరంలోని బాలాత్రిపుర సుందరీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను పూర్తి రాజకీయ జాతరగా మార్చారని విమర్శించారు. దీనివలన భక్తుల ఆధ్యాత్మిక మనోభావాలు దెబ్బ తిన్నాయన్నారు. రాజకీయ పార్టీల పెత్తనం లేకుండా ధర్మకర్తల నిర్వహణలోనే ఆలయం పని తీరును మెరుగు పరచాలని సూచించారు. రాజకీయ వర్గాల ఆధిపత్యంతో దేవాలయాలు భ్రష్టు పట్టడం క్షమించరానిదన్నారు. ఈ వ్రతాలకు ఇచ్చిన 2 వేల కూపన్లలో రోజువారీ భక్తులకు 100 ఇచ్చి, మిగిలిన 1,900 పార్టీ శ్రేణులకు ఇవ్వడం అధికారుల బాధ్యతా రాహిత్యమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర ప్రజలకు దేవదాయ శాఖ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అన్ని ప్రభుత్వ దేవాలయాల వద్ద రాజకీయ ఆధిపత్య ప్రచార బోర్డులు ఏర్పాటు చేయడం, పార్టీ శ్రేణులు సమావేశాలు పెట్టడాన్ని పూర్తిగా కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధోరణితో ఆలయాలు రాజకీయ శిబిరాలుగా మారాయన్నారు. నగరంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో హిందుత్వాన్ని దెబ్బ తీసేలా ఏడాది పొడవునా దర్శనం టికెట్లు పెట్టడం, ధర్మదర్శనాన్ని భక్తులకు దూరం చేయడం ఇష్టారాజ్యంగా మారిందని రమణరాజు దుయ్యబట్టారు.

17 బస్సులపై కేసులు

రావులపాలెం: ఈతకోట టోల్‌ ప్లాజా వద్ద శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకూ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. డ్రైవర్‌ క్యాబిన్‌లో అనధికారిక బెర్త్‌ ఏర్పాటు, అత్యవసర ద్వారానికి అడ్డంగా సీట్‌ ఏర్పాటు, గడువు తీరిన అగ్ని ప్రమాద నిరోధక పరికరాన్ని బస్సులో ఉంచడం, మిరుమిట్లు గొలిపే కాంతిని వెదజల్లే హెడ్‌ లైట్లు అమర్చడం వంటి ఉల్లంఘనలను గుర్తించామని జిల్లా రవాణా శాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 42 ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులను తనిఖీ చేసి, ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ స్టాండర్డ్స్‌ నిబంధనలు పాటించని 17 బస్సులపై కేసులు నమోదు చేసి, రూ.69,400 అపరాధ రుసుం విధించామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తనిఖీల్లో మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు రాజేంద్ర ప్రసాద్‌, సురేష్‌ కుమార్‌, షణ్ముఖ్‌ శ్రీనివాస్‌, వరప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement