● నిర్ణయించిన అన్నవరం ట్రస్ట్‌బోర్డు
● డొనేషన్ల కోసం స్కీం ఏర్పాటు
అన్నవరం: రత్నగిరిపై వీర వెంకట సత్యనారాయణస్వామి ఆలయ విమాన గోపురానికి భక్తుల విరాళాలతో బంగారు తాపడం చేయించాలని దేవస్థానం ధర్మకర్తల మండలి (ట్రస్ట్ బోర్డు) తీర్మానించింది. ఇందుకోసం డోనేషన్ స్కీం ప్రారంభించాలని నిర్ణయించింది. దేవస్థానం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన బుధవారం ట్రస్ట్‌బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను చర్చించి తీర్మానించారు. సత్యదేవుని నూతన ఆలయం నిర్మించి 14 ఏళ్లు పూర్తి కావస్తుండగా విమాన గోపురానికి బంగారు తాపడం చేయాలని గతంలోనే నిర్ణయించారు. ప్రస్తుత దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ 2011లో దేవస్థానం ఈఓగా పనిచేసినపుడు స్వామివారి ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆలయ నిర్మాణంలో అంతా గ్రానైట్ రాయినే వాడినప్పటికీ ఆలయ గోపురం మాత్రం స్వర్ణరేకు తాపడం చేయాలన్న ఆలోచనతో ఇటుకతో నిర్మించారు. 2024లో దేవస్థానం ఈఓగా కె.రామచంద్రమోహన్ ఆలయ శిఖరానికి స్వర్ణ రేకు తాపడం చేసేందుకు సుమారు 12 కిలోల బంగారం అవసరమవుతుందని అంచనా వేశారు. అప్పుడు కేజీ బంగారం రూ.60 లక్షలు ఉండగా అన్ని ఖర్చులు కలిపి సుమారు రూ.ఎనిమిది కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం బంగారం కేజీ రూ.1.60 కోట్లు ఉంది. దీంతో సుమారు రూ.20 కోట్లు అవుతుందని అంచనా. కాగా.. సత్యదేవుని ఆలయ శిఖరం స్వర్ణ తాపడంపై మే 16 వ తేదీన సాక్షి దినపత్రికలో ‘స్వర్ణం స్వప్నమేనా!’ శీర్షికతో వార్తా కథనం ప్రచురితమైంది. ఆ వార్త దేవదాయశాఖ ఉన్నతాధికారులలో చర్చనీయాంశమైంది. తాజాగా జరిగిన ట్రస్ట్‌బోర్డు సమావేశంలో భక్తుల విరాళాలతో సత్యదేవుని ఆలయ శిఖరం స్వర్ణ తాపడం చేయాలని నిర్ణయించడంతో మరలా దీనిపై ఆశలు చిగురిస్తున్నాయి.
ఇతర తీర్మానాలు
● నవంబర్ పదో తేదీ నుంచి ప్రారంభం కానున్న కార్తికమాసంలో సత్యదేవుని ఆలయానికి లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున రూ.కోటి వ్యయంతో ఏర్పాట్లు చేయాలని తీర్మానించారు. ఇందులో సత్యదేవుని తెప్పోత్సవం, గిరిప్రదక్షణ కొరకు చేపట్టాల్సిన ఏర్పాట్లు కోసం టెండర్లు పిలిచేందుకు రూపొందించిన అంచనాలను ఆమోదించారు.
● సత్రాల గదులలో మంచాలపై వేసేందుకు గాను వివిధ సైజుల బెడ్‌షీట్లు 1,500 కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు.
● దేవస్థానానికి చెందిన రత్నగిరి మీద 0.5 ఎకరం, కొండ దిగువన ఎకరం మొత్తం 1.5 ఎకరాలను టూరిజం డిపార్ట్‌మెంట్‌కు 33 ఏళ్లకు లీజుకు ఇచ్చేందుకు వచ్చిన ప్రతిపాదనను తిరస్కరిస్తూ తీర్మానం చేశారు.
● 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా రూ.63 లక్షలతో రత్నగిరి నుంచి కొండదిగువకు అండర్ గ్రౌండ్ కేబుళ్లు వేసేందుకు తీర్మానించారు.
● దేవస్థానంలో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వైద్యసేవలు అందిస్తున్న సీనియర్ వైద్యాధికారి డాక్టర్ పాండురంగారావుకు నెలకు రూ.50 వేల వేతనం చెల్లించేందుకు తీర్మానించారు.


