దేవీపట్నం: అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన పెద్దపులి మళ్లీ దేవీపట్నానికి చేరింది. ఈ ఏడాది తొలకరి ఆరంభంలో పోలవరం జిల్లాలోని పాపికొండల అభయారణ్య ప్రాంతమైన దేవీపట్నం, పూడిపల్లి తదితర ప్రాంతాల్లో తిష్టవేసిన పెద్దపులి ఎట్టకేలకు జూన్‌లో గోదావరి దాటుకుని ఏలూరు జిల్లాలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి సుమారు రెండు నెలలకు పైబడి తెలంగాణ వరకూ సంచరించి ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలకు చేరింది. రెండు రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టు సమీపాన సంచరించిన పెద్దపులి మంగళవారం అర్ధరాత్రి సింగనపల్లి వద్ద గోదావరి దాటుకుని పోలవరం జిల్లాలోని దేవీపట్నం ఎగువ ప్రాంతానికి చేరింది. పెద్దపులి మెడకు అమర్చిన రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాకర్ ద్వారా పులి గమనాన్ని పరిశీలిస్తున్న అటవీ అధికారులు దేవీపట్నం పరిసర గ్రామాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతంలో తమ సిబ్బందిని అప్రమత్తం చేశామని ఇందుకూరు అటవీ రేంజ్ అధికారి కొండలరావు తెలిపారు. గత వారం రోజులుగా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో అభయారణ్యంలో సంచరించిన పెద్ద పులి ఒక దూడను హతమార్చి, మరో దూడను గాయపరచిందని పోలవరం అటవీ శాఖ రేంజ్ అధికారి ఎస్‌కే వలీ తెలిపారు.
మహిళా సంఘాలు
ఆర్థిక ప్రగతి సాధించాలి
సామర్లకోట: మహిళా సంఘాలు ఆర్థిక ప్రగతి సాధించాలని మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ కె.శైలజ అన్నారు. స్థానిక మెప్మా కార్యాలయంలో బుధవారం జరిగిన జిల్లా స్థాయి అర్బన్ మహిళా సమాఖ్య సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహిళా సంఘాలు చేస్తున్న పొదుపు ఆధారంగా వారికి బ్యాంకు రుణాలు అందజేయడంతో పాటు వాటిని సద్వినియోగం చేసుకొని వ్యాపారవేత్తలుగా రాణించేలా తయారు చేయాలని సూచించారు. డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం స్వయం బ్రాండ్‌ను బలోపేతం చేయాలన్నారు. మహిళా సంఘాల తక్షణ ఆర్థిక అవసరాల కోసం సీ్త్రనిధిని ఉపయోగించుకోవాలని చెప్పారు. పురమిత్ర యాప్‌ను ప్రతి ఒక్కరూ ఉపయోగించాలన్నారు. సాంకేతిక నిపుణుడు పి.రవిశంకర్, జిల్లా అర్బన్ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు డి.బుజ్జమ్మ కూడా మాట్లాడారు. సమీక్ష అనంతరం 11వ వార్డులోని భీమవరం మురికివాడలోని నవజ్యోతి సంఘ సమావేశానికి శైలజ హజరయ్యారు. పురమిత్ర యాప్‌ను పరిశీలించి, సభ్యులకు అవగాహన కల్పించారు.


