కాకినాడలో వ్యక్తి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

కాకినాడలో వ్యక్తి దారుణ హత్య

Sep 3 2026 12:31 AM | Updated on Sep 3 2026 12:31 AM

కాకినాడ క్రైం: నగరంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సొంత ఇంట్లోనే ఎనిమిది కత్తి పోట్లకు గురికావడం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇందిరా కాలనీలోని సెవెన్‌ హిల్స్‌ రోడ్డులో గండి గిరిధర్‌ (37) తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడి తండ్రి బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం చేస్తూ విరమణ పొంది, కొన్నాళ్ల క్రితం చనిపోయాడు. గిరిధర్‌కు భార్యతో నాలుగేళ్ల క్రితం విడాకులు అయ్యాయి. కాగా.. మంగళవారం గిరిధర్‌ తల్లి ద్రాక్షారామంలో బంధువుల ఇంటికి వెళ్లింది. రాత్రి గిరిధర్‌ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. తల్లి బుధవారం ఉదయం 9 గంటల సమయంలో కుమారుడికి ఫోన్‌ చేసింది. స్పందించక పోవడంతో పక్కింటి వారికి చేసి ఫోన్‌ ఇమ్మని కోరింది. పక్కింటి వ్యక్తి ఉదయం తొమ్మిదే కదా అయింది, నిద్రలోనే ఉండి ఉంటాడు అని చెప్పేసరికి ఊరుకుంది. 11 గంటల సమయంలో మరో సారి కాల్‌ చేసినా గిరిధర్‌ స్పందించలేదు. దీంతో అదే పక్కింటి వ్యక్తికి చెబితే ఆయన కిటికీ తలుపు తీసి చూశాడు. గిరిధర్‌ మంచంపై రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించి కంగారు పడ్డాడు. తక్షణమే 112కి ఫోన్‌ చేసి పోలీసులకు, తల్లికి చెప్పాడు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ రంగంలోకి దిగాయి. పోలీసులు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు త్రీ టౌన్‌ సీఐ సత్యనారాయణ తెలిపారు. మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు.

యువతి కోసమేనా!

గిరిధర్‌ హత్యకు ఓ యువతి నేపథ్యమే కారణమని తెలుస్తోంది. అతడికి స్నేహితులైన ఇద్దరు వ్యక్తులు స్థానికంగా నివసిస్తుంటారు. మంగళవారం రాత్రి ఇంట్లో తల్లి లేదని గిరిధర్‌ స్నేహితులను ఇద్దరినీ పిలిపించి మద్యం తాగాడు. కాసేపటికి గిరిధర్‌ ఫోన్‌లో ఇద్దరిలో ఓ వ్యక్తి తన ప్రియురాలితో చనువుగా ఉన్న ఫొటోలు చూశా డు. తనతో ఎందుకు అలా ఉన్నావని ఆగ్రహంతో ఊడిపోయాడు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. దీంతో మరో స్నేహితుడు కూడా గిరిధర్‌పై దాడికి దిగాడు. ఇద్దరి దాడిలో బాధితుడు నేలకు ఒరగగా అక్కడే ఉన్న చాకుతో పొడిచి ఇంటి వెనుక తలుపు నుంచి బయటికి వచ్చి గడియపెట్టి వెళ్లిపోయారు. అనుమానితులు ఇద్దరూ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండగా త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నారు. హత్య మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో జరిగితే, బుధవారం ఉదయం 11 గంటలకు పోలీసులకు సమాచారం అందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement