నిమ్మదిగా పదింతలై.. | - | Sakshi
Sakshi News home page

నిమ్మదిగా పదింతలై..

Sep 3 2026 12:31 AM | Updated on Sep 3 2026 12:31 AM

దిగుబడులపై ఎల్‌నినో ప్రభావం

నిమ్మ దిగుబడులపై ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం పడింది. వర్షాకాలం ప్రారంభమై దాదాపు మూడు నెలలు కావొస్తున్నా, కనీస వర్షపాతం నమోదు కాలేదు. దీంతో నీటి తడులు అందక నిమ్మతోటలు దెబ్బతిన్నాయి. సాధారణంగా వర్షాకాలంలో నిమ్మకాయల వినియోగం తక్కువగా ఉంటుంది. ఈ సీజన్‌లో కాయలు కొనేవారు లేక చెట్ల కిందే నిమ్మపండ్లు పడి ఉంటాయి. ఈ ఏడాది కాపులు లేకపోవడంతో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. కాయ సైజు పెరగడం లేదు. పిందె దశలోనే కాయలు గిడసబారిపోతున్నాయి. పూతలు దెబ్బతినడం వల్ల కాపులు నిలబడడంలేదు. మంగు, గజ్జి తెగులు, బంక వంటి చీడపీడలు తోటలకు ఎక్కువగా ఆశిస్తున్నాయి.

నిమ్మకాయల ధర కిలో రూ.100

గత నెలలో కిలో రూ.8 నుంచి రూ.10

తగ్గిన దిగుబడితో రైతన్న దిగాలు

దేవరపల్లి: నిమ్మకు ‘పంట’గొచ్చింది.. మార్కెట్‌లో ధర అదరగొడుతోంది. ధర బాగున్నా దిగుబడులు లేక రైతులు నిరాశ చెందుతున్నారు. ఒకపక్క మార్కెట్లో కాయల ధర రోజురోజుకు పెరుగుతుండగా, దీనికి తగ్గట్టుగా తోటల్లో కాపులు లేకపోవడంతో పెట్టుబడులు రావడం కష్టమని రైతులు వాపోతున్నారు. కౌలు రైతులకు పంట గిట్టుబాటు కాని పరిస్థితి. మంగళవారం యాదవోలు నిమ్మ మార్కెట్‌లో కిలో కాయలు రూ.100 పలికాయి. కిలోకు కాయ పరిమాణాన్ని బట్టి 25 నుంచి 30 కాయలు తూగుతున్నాయి. రెండు వారాల క్రితం కిలో రూ. 60 నుంచి రూ.70 పలకగా, ప్రస్తుతం నాణ్యతను బట్టి రూ. 90 నుంచి రూ.100 పలుకుతున్నట్టు రైతులు తెలిపారు. జూలైలో కిలో కాయలు రూ.10 నుంచి రూ.15 రాగా, ఈ నెల నుంచి మార్కెట్లో ధర క్రమేపీ పుంజుకుని రూ.100కు చేరుకుంది. కొవ్వూరు డివిజన్‌లోని మెట్ట ప్రాంతంలో దేవరపల్లి మండలం యాదవోలు నిమ్మ మార్కెట్‌ రైతులకు అనుకూలంగా ఉంటుంది. చుట్టపక్కల గ్రామాల నుంచి రైతులు ఏ రోజు కోసిన కాయలు ఆ రోజు మార్కెట్‌కు తీసుకు వచ్చి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడ రైతులే వ్యాపారులుగా మారి తోటి రైతుల వద్ద నుంచి కాయలు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. సాధారణంగా మార్కెట్లో కాయలు అమ్మినందుకు వ్యాపారులు కమీషన్‌ వసూలు చేస్తారు. అయితే యాదవోలులో రైతుల మార్కెట్‌ కావడంతో ఎటువంటి కమీషన్‌ తీసుకోకుండా కాయలు కొనుగోలు చేస్తారు. ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు నిమ్మకాయల సీజన్‌ ఉంటుంది. వేసవిలో పండిన పంటకు రైతులకు మంచి ఆదాయం వస్తుంది. వర్షాకాలం, సీతాకాలంలో నిమ్మ వినియోగం తక్కువగా ఉంటుంది. దీంతో ఎగుమతులు లేక అంతంత మాత్రంగా ఉంటాయి. ఈ రెండు సీజన్లలో కిలో కాయలు రూ. 8 నుంచి 10 పలుకుతాయి. దీంతో కాయలు కోత కూలి డబ్బులు రాక రైతులు చెట్ల కిందనే కాయలు వదిలివేస్తారు.

8,560 ఎకరాల్లో సాగు

జిల్లాలోని మెట్ట ప్రాంతంలో సుమారు 8,560 ఎకరాల్లో నిమ్మ సాగు జరుగుతుంది. గోపాలపురం నియోజకవర్గంలో దాదాపు 2,600 ఎకరాల్లో పంట సాగులో ఉంది. దేవరపల్లి మండలం యాదవోలు, చిన్నాయగూడెం, కొత్తగూడెం గ్రామాల్లో నిమ్మ సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంది. గోపాలపురం, నల్లజర్ల, నిడదవోలు మండలాల్లో కూడా రైతులు నిమ్మసాగు చేస్తున్నారు. దాదాపు 40 ఏళ్లుగా ఈ ప్రాంతాల్లో సాగు ఉంది.

ఇతర రాష్ట్రాలకు ఎగుమతి

యాదవోలు మార్కెట్‌ నుంచి ఒడిశా, కోల్‌కతా, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, నేపాల్‌, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, రాజమహేంద్రవరం ప్రాంతాలకు నిమ్మకాయలు ఎగుమతి జరుగుతుంది. సీజన్‌లో కాపులు బాగుంటే రోజుకు 100 నుంచి 150 టన్నుల వరకు నిమ్మకాయలు ఎగుమతి జరుగుతుందని వ్యాపారులు తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ మార్కెట్‌ నుంచి రాజమహేంద్రవరం, అనకాపల్లి, యలమంచిలి, వైజాగ్‌, నర్సీపట్నం, కాకినాడ, తణుకు, భీమవరం, సత్తుపల్లి, ఖమ్మం ప్రాంతాలకు ఎగుమతి జరుగుతున్నాయి.

మార్కెట్‌ బాగుంది

నిమ్మ మార్కెట్‌ బాగుంది. నెల రోజుల క్రితం కిలో నిమ్మకాయలు రూ.8 ధర ఉండగా, ప్రస్తుతం రూ. 90 నుంచి 100 ధర పలుకుతుంది. సాధారణంగా వర్షాకాలంలో నిమ్మ దిగుబడి ఎక్కువగా ఉండి, కిలో రూ. 8 నుంచి 10 ధర ఉంటుంది. ఈ ఏడాది వర్షాలు లేక చిన్నపిందె ఎదగడం లేదు. మార్కెట్‌ బాగున్నా, కాయలు లేవు. ఈ రోజుల్లో మార్కెట్‌కు 50 టన్నుల కాయలు వచ్చేవి. ప్రస్తుతం 10నుంచి 15 టన్నుల కాయలు వస్తున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో నిమ్మ వినియోగం పెరిగింది.

–అనిశెట్టి సూర్యచంద్రం, రైతు, వ్యాపారి, యాదవోలు, దేవరపల్లి మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement