● ఉపకులపతి డాక్టర్ ధనంజయరావు
● ఘనంగా ప్రపంచ కొబ్బరి దినోత్సవం
అంబాజీపేట: వాతావరణ మార్పులు, మార్కెట్ ఒడిదొడుకులు ఎదురైనా ఆహార, ఇంధన, ఆర్థిక రక్షణ కల్పించే ఏకైక పంట కొబ్బరి సాగు అని ఉప కులపతి డాక్టర్ కె.ధనంజయరావు అన్నారు. అంబాజీపేట డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధన కేంద్రంలో ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని కేంద్రం అధిపతి పి.అశోక్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. సాగులో శాసీ్త్రయ పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ ధనంజయరావు మాట్లాడుతూ ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో భారతదేశ 31.24 శాతం వాటాతో ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో కొనసాగుతోందన్నారు. భూమి వినియోగ సామర్థ్యం హైబ్రిడ్ వంగడాల ప్రాముఖ్యత ప్రాసెసింగ్ సాంకేతికాలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. పరిశోధన సంచాలకురాలు డాక్టర్ ఎస్.సూర్యకుమారి మాట్లాడుతూ ఎల్‌నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కొబ్బరి నీటి ఆవశ్యకతను, వాతావరణ మార్పులను తట్టుకునే సరికొత్త రకాలను నాటుకోవాలన్నారు. సహాయ సంచాలకుడు డాక్టర్ డి.వెంకటస్వామి మాట్లాడుతూ వర్జిన్ కొబ్బరి నూనె, కొబ్బరి పాలు వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. ప్లాంట్ పేథాలజీ శాస్త్రవేత్త డాక్టర్ బి.నీరజ కొబ్బరిలో తెగుళ్లు, సమగ్ర సస్యరక్షణ యాజమాన్యంపై అవగాహన కల్పించారు. డాక్టర్ ఎం.జానకి, ఏంటమాలజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అనూష తదితరులు సాగుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారులు దిలీప్ కుమార్, జి.కోటేశ్వరరావు, అభ్యుదయ రైతులు ముత్యాల జమీల్, ఉప్పు గంటి భాస్కరరావు, వరప్రసాద రావు, హార్టీ కల్చర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం. సంఘమిత్ర తదితరులు పాల్గొన్నారు.


