● సంక్షేమ, అభివృద్ధి ప్రదాత వైఎస్సార్
● జిల్లా అభివృద్ధిలో కీలక భూమిక
● పుష్కర ఎత్తిపోతల పథకంతో అన్నదాతకు వెన్నుదన్ను
● ప్రతిష్టాత్మక జేఎన్‌టీయూ–కాకినాడ ఏర్పాటు
● ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేదలకు మేలు
● నేడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి
–8లో..
రాజా ది గ్రేట్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సంక్షేమ, అభివృద్ధి ప్రదాతగా.. ప్రజలకు ఆత్మీయుడిగా.. మెట్ట రైతులకు ఆప్తబంధువుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కీర్తిప్రతిష్టలు గడించారు. తన పాలనా కాలంలో ఇటు సంక్షేమానికి, అటు అభివృద్ధికి, ప్రజా ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ జిల్లా అభివృద్ధిలో చెరగని ముద్ర వేసుకున్నారు. వ్యవసాయ రంగాన్ని అగ్రగామిగా నిలిపేందుకు రైతుల సంక్షేమానికి సింహభాగం నిధులు కేటాయించారు. ఆరోగ్యశ్రీ ద్వారా వేలాది మందికి ఖరీదైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంతో ఎంతో మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఇంజినీరింగ్, మెడిసిన్ త దితర ఉన్నత విద్యను అందించారు. తన సుదీర్ఘ పాదయాత్రలో తెలుసుకు న్న సమస్యలకు అధికారంలోకి వచ్చాక పరిష్కారం చూపారు. నేడు ఆ మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా.. జిల్లా ప్రగతికి ఆ మహనీయుడు అందించిన సేవలను స్మరించుకుందాం రండి..
ప్రగతి కాంతులివిగో..
● జిల్లాలోని మెట్ట ప్రాంతంలో దాదాపు లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద రూ.600 కోట్లతో తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకాన్ని వైఎస్సార్ నిర్మించి, ప్రారంభించారు. తద్వారా మెట్ట ప్రాంతానికి ఆయన అపర భగీరథుడిగా నిలిచారు.
● గోదావరి డెల్టా స్థిరీకరణతో పాటు జిల్లాలోని మెట్ట ప్రాంతానికి, ఉత్తరాంధ్ర జిల్లాలకు సాగు, తాగునీరందించే లక్ష్యంతో గోదావరిపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. ఎడమ ప్రధాన కాలువ నిర్మాణాన్ని సైతం ఆయన హయాంలోనే చాలా వరకూ పూర్తి చేశారు.
● రూ.52 కోట్లతో తాండవ ప్రాజెక్టును వైఎస్సార్ ఆధునికీకరించి, కుడి, ఎడమ కాలువలు, పిల్ల కాలువలకు శాశ్వత పరిష్కారం చూపారు. తద్వారా 30 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందించారు. తుని వద్ద తాండవ నదిపై భూమి, ముఠా మినీ ఆనకట్టలను రూ.5 కోట్లతో నిర్మించి, పట్టణ ప్రజలకు పుష్కలంగా తాగునీరు అందుబాటులోకి తెచ్చారు.
● 2004 ఎన్నికలకు ముందు గోకవరం వచ్చిన వైఎస్ అక్కడి రైతుల కగడండ్లు చూసి చలించిపోయారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత 22 వేల ఎకరాలకు సాగునీరందించాలనే సంకల్పంతో రూ.205 కోట్లతో రంపచోడవరంలో ముసురుమిల్లి ప్రాజెక్టు నిర్మించారు. తద్వారా గోకవరం మండలంలో సుమారు 10 వేల ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందించారు.
● ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణకు 2009లో రూ.132 కోట్లతో వైఎస్సార్ శ్రీకారం చుట్టారు.
● పిఠాపురం బ్రాంచ్ కెనాల్‌ను రూ.120 కోట్లతో ఆధునికీకరించారు.
● ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంతో ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, తుని తదితర నియోజకవర్గాల్లోని మెట్ట ప్రాంత రైతుల సాగునీటి కష్టాలను కడతేర్చిన నేతగా వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ అందించారు.
విశ్వవిద్యాలయాల ఏర్పాటు
● వైఎస్సార్ అధికారంలోకి వచ్చేనాటికి జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) పరిధిలో కాకినాడలో ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కళాశాల ఉండేది. నాటి ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులకూ అత్యున్నత సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకు వచ్చే లక్ష్యంతో జేఎన్‌టీయూను విభజించారు. ఇందులో భాగంగా కాకినాడ ఇంజినీరింగ్ కళాశాలను జేఎన్‌టీయూ–కాకినాడగా ఏర్పాటు చేశారు.
● జిల్లాకో విశ్వవిద్యాలయం ఉండాలనే లక్ష్యంతో అప్పటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజానగరం వద్ద ఆదికవి నన్నయ పేరిట యూనివర్సిటీ ఏర్పాటు చేశారు.
● సముద్ర కోత నుంచి ఉప్పాడ తీరాన్ని రక్షించేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం జియో ట్యూబ్ రక్షణ గోడ నిర్మించింది.
● సామర్లకోట, పెద్దాపురం జంట మున్సిపాలిటీల్లో రూ.15 కోట్లతో తాగునీటి ట్యాంకులు నిర్మించి, లక్ష మంది దాహార్తిని తీర్చారు.
● రూ.12 కోట్లతో పెద్దాపురంలో రాజీవ్ గృహకల్ప ఇళ్ల నిర్మాణం చేపట్టారు. రూ.25 కోట్లతో పేదల ఇళ్ల నిర్మాణానికి 13 ఎకరాలు కొనుగోలు చేశారు. కాకినాడలో కూడా వేలాది మంది నిరుపేదల సొంతింటి కలను రాజీవ్ గృహకల్పతో సాకారం చేశారు.
● కాకినాడ నగరంలోని సినిమా రోడ్డులో వైఎస్ నిర్మించిన ఫ్లై ఓవర్‌తో ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పాయి. కాకినాడలో సాంబమూర్తి నగర్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి కూడా వైఎస్సార్ చలవే కారణం. దీని నిర్మాణం ఫలితంగా రాజీవ్ గృహకల్ప, పోర్టు ప్రాంతాలకు నేడు ప్రయాణం సాఫీగా సాగుతోంది. తుని పట్టణంలో సైతం ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించారు.
● రూ.2కే కిలో బియ్యం పథకాన్ని 2004కు ముందు చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసి, పేదల కడు పు కొట్టింది. ఈ పథకాన్ని వైఎస్సార్ పునరుద్ధరించి, లక్షలాది మంది పేదల ఆకలి తీర్చారు.
నేడు సేవా కార్యక్రమాలు
దివంగత మహానేత వైఎస్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలు, ప్రజలపై ఆయనకున్న అభిమానాన్ని మరోసారి గుర్తు చేసుకునేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు, ఆయన అభిమానులు సన్నద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


