● గ్రామాల్లో చాప కింద నీరులా విస్తరణ
● మత్తుకు చిత్తవుతున్న బాల్యం
● పాఠశాలల నుంచి చెరశాలలకు
వెళ్తున్న పిల్లలు
● కూలిపోతున్న కుటుంబాల ఆశలు
సరదాగా మొదలుపెట్టి..
గొల్లప్రోలు మండలం చెందుర్తికి చెందిన మణికంఠ పదో తరగతి చదువుకుంటున్నాడు. స్నేహితుల ద్వారా గంజాయి తాగడానికి అలవాటు పడ్డాడు. తొలుత సరదాగా తాగినప్పటికీ క్రమంగా ప్రతి రోజూ తాగకపోతే ఉండలేని స్థితికి చేరుకున్నాడు. దాని కోసం ఏ పని చేయడానికై నా సిద్ధమైన అతడు.. చివరకు పోలీసులకు పట్టుబడి, జువైనల్ హోమ్‌కు వెళ్లాడు. బెయిల్‌పై వచ్చినా గంజాయి అలవాటు అతడిని నేర ప్రవృత్తి వైపు మళ్లించింది. దీంతో, దొంగతనాలకు తెగించాడు. మరో ఇద్దరితో కలసి కొత్తపల్లి మండలం గోర్సలోని ఓ ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు దోచుకుపోయాడు. చివరకు పోలీసులకు చిక్కి మళ్లీ ఊచలు లెక్క పెడుతున్నాడు. ఇలాగే మరో బాలుడు అతడితో కలసి గంజాయి తాగి, దొంగతనంలో పాలు పంచుకుని పోలీసులకు దొరికిపోయాడు. ఇవి మచ్చుకు మాత్రమే. ఇటీవల జరుగుతున్న చాలా వరకూ దొంగతనాలు ఎవరో పేరు మోసిన దొంగలు చేస్తున్నవి కావు.. కేవలం గంజాయికి అలవాటు పడిన పిల్లలు చేస్తున్నవే ఎక్కువగా ఉండటం సమాజాన్ని కలవరపరుస్తోంది.
పిఠాపురం: పెన్ను పట్టుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన ఆ పసి చేతులు.. నేడు గంజాయి కూరిన సిగరెట్లు పట్టుకుంటున్నాయి. ప్రపంచం అంటే ఏమి టో పూర్తిగా తెలియని వారు.. ఆటపాటలతో హుషారుగా గడపాల్సిన వయసులోనే మత్తు పదార్థాలకు బానిసలుగా మారిపోతున్నారు. పాఠశాలల్లో చదువుకోవాల్సిన వయసులో చెరశాలలో శిక్ష అనుభవించాల్సిన దుస్థితిలో కూరుకుపోతున్నారు. ఇంతకుముందు పెద్దలు, కళాశాల స్థాయి యువతకే పరిమితమైన ఈ మత్తు మహమ్మారి.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చాప కింద నీరులా విస్తరిస్తోంది. నానాటికీ తీవ్రరూపం దాల్చుతున్న ఈ గంజాయి ఆరు నుంచి పదో తరగతి వరకూ చదువుకునే విద్యార్థుల భవిష్యత్తును కూడా కబళిస్తూండటం ఆందోళన కలిగిస్తోంది.
మానసిక రుగ్మతలు
● గంజాయి వాడకం వల్ల పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం దారుణంగా దెబ్బ తింటోంది.
● ఆ పిల్లలు తీవ్రమైన ఉద్రేక స్వభావానికి లోనవుతున్నారు. చిన్న విషయాలకే విపరీతంగా కోప్పడటం, తల్లిదండ్రులపై సైతం దాడికి దిగడం లేదా వస్తువులు పగులగొట్టడం చేస్తున్నారు.
● మత్తుకు అలవాటు పడిన పిల్లలు గంజాయి కోసం ఏం చేయడానికై నా వెనుకాడటం లేదు. చాలామంది నేరాల బాట పడుతున్నారు. మత్తు పదార్థాల కొనుగోలుకు ఇంట్లో డబ్బులు ఇవ్వకపోతే దాడులు చేయడం, లేదా దొంగిలించడం చేస్తున్నారు. కొంతమంది చైన్ స్నాచింగ్ వంటి నేరాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం గంజాయి, దొంగతనం కేసుల్లో దొరుకుతున్న బాలలే దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నారు.
● గంజాయి తాగడం వల్ల జ్ఞాపక శక్తి మందగిస్తోంది. చదువుపై ఏకాగ్రత లోపిస్తోంది. దీంతో, ఆ పిల్లలు బడికి డుమ్మా కొట్టి, తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు.
తల్లిదండ్రులు అప్రమత్తం కావాల్సిందే..
తమ పిల్లలు మత్తుకు అలవాటు పడుతున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు ముందుగానే గుర్తించవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. రోజూ కంటే భిన్నంగా విపరీతమైన కోపం, నిద్ర లేమి, అర్ధరాత్రి వరకూ ఫోన్ వాడకం, ఇంట్లో నుంచి అనుమానాస్పదంగా డబ్బులు లేదా విలువైన వస్తువులు మాయమవడం, స్కూల్, కాలేజీకి డుమ్మా కొడుతూ నిర్మానుష్య ప్రాంతాల్లో ఎక్కువ సమయం గడపడం, చేతులు, కాళ్లు వణకడం లేదా కళ్లు ఎప్పుడూ ఎర్రగా ఉండటం వంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. అవసరమైతే మానసిక వైద్య నిపుణులను సంప్రదించి పిల్లలు మత్తు అలవాటు నుంచి బయటపడేలా చూడాలి.
ఇలా చేస్తే మేలు
గంజాయి మత్తు వ్యాప్తిలో పోలీసుల వైఫల్యం కూడా ఉందనే విమర్శలున్నాయి. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ అవగాహన సదస్సులతో సరిపెట్టడం తప్ప.. గంజాయిని పక్కాగా అరికట్టేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు పూర్తి స్థాయి ఫలితాలనివ్వడం లేదు. ముఖ్యంగా విద్యా సంస్థల సమీపంలోని బల్లలు, పాన్ షాపులు, నైట్ పాయింట్లలో నిరంతరం తనిఖీలు నిర్వహించాలి. మత్తుకు బానిసలైన పిల్లలను నేరస్తుల్లా కాకుండా కౌన్సెలింగ్, చికిత్స అందించి, సాధారణ జీవితంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేయాలి.
గ‘మ్మత్తు’గా చిత్తు..
మత్తు మాఫియా బడి పిల్లలనే తన టార్గెట్‌గా మార్చుకుంటోంది. చిన్న వయసులోనే ఉచితంగా అలవాటు చేసి, ఆ తర్వాత వారి ద్వారానే ఇతర పిల్లలకు విక్రయించే ఏజెంట్లుగా మార్చుకుంటున్నారు. ఒక్కసారి ఆ మత్తుకు అలవాటు పడితే.. ఇక దాని నుంచి బయటపడటం అరుదుగా మారిపోతోంది.
పాకెట్ మనీకి అందుబాటులో ఉండే ధరకే చాక్లెట్లు, సిగరెట్లు, రోల్స్ రూపంలో గంజాయిని ఆ మాఫియా విచ్చలవిడిగా అందిస్తోంది.
ఒక్కసారి ట్రై చేయి, కేకులా ఉంటుందని స్నేహితులు చెప్పే మాటలకు తొలుత ఆకర్షితులవుతు న్న పిల్లలు.. ఆపై దానికి అలవాటు పడుతున్నారు.
గంజాయి అందుబాటులో లేకపోతే వైట్‌నర్లు, పెయింట్ థిన్నర్లు, నెయిల్ పాలిష్, గమ్ ట్యూబులను పీల్చి మత్తులో మునగడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసుల విచారణలో తేటతెల్లమవుతోంది.


