సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.81 కోట్లు | - | Sakshi
Sakshi News home page

సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.81 కోట్లు

Sep 2 2026 12:12 AM | Updated on Sep 2 2026 12:12 AM

అన్నవరం: సత్యదేవునికి ఆగస్టు నెలలో హుండీ ఆదాయం దండిగా సమకూరింది. గత 33 రోజులకు గాను రూ.1,81,04,918 ఆదాయం వచ్చిందని దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ ఎన్‌.సూర్యచక్రధరరావు మంగళవారం తెలిపారు. నగదు రూ.1,71,50,672, చిల్లర నాణేలు రూ.9,54,246 మేర వచ్చాయని వివరించారు. శ్రావణ మాసం, పెద్ద సంఖ్యలో వివాహాలు జరగడం, వేలాదిగా భక్తులు తరలి రావడంతో వారు సమర్పించిన కానుకలతో హుండీలు నిండిపోయాయి. సత్యదేవుని హుండీల ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ కూడా లభించింది. ఖతార్‌ రియల్స్‌ 105, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దీరామ్స్‌ 100, కెనడా డాలర్లు 20, అమెరికన్‌ డాలర్లు 20, మలేషియా రింగిట్స్‌ 2, యూరోలు 10, సౌదీ సెంట్రల్‌ బ్యాంక్‌ రియల్స్‌ 15, ఇంగ్లండ్‌ పౌండ్లు 30, న్యూజిలాండ్‌ డాలర్లు 40, సింగపూర్‌ డాలర్లు 24, వియత్నాం కరెన్సీ 2 లక్షల డాంగ్స్‌, రష్యా రూబుల్స్‌ 50, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఒమన్‌ బైసా 200, నేపాల్‌ రూపాయలు 25, స్విస్‌ ఫ్రాంక్స్‌ 50 చొప్పున లభించాయని చైర్మన్‌, ఈఓ వివరించారు.

ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో వైద్య విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపుతూ 2026– 27 విద్యా సంవత్సరానికి వైద్య విద్య ఫీజులను పెంచాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.కిరణ్‌ కుమార్‌ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలనే ఆశలను ఈ ఫీజుల పెంపు నిర్ణయం దెబ్బతీస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో విద్యార్థులు, యువత భవిష్యత్తుకు పెద్దపీట వేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులపై వరుసగా ఆర్థిక భారాలు మోపడం దారుణమన్నారు. విద్య అనేది ప్రతి విద్యార్థి హక్కని, డబ్బున్న వారికి మాత్రమే దక్కే వ్యాపార వస్తువు కాదన్నారు. యూజీ వైద్య విద్య ఫీజులను 10 శాతం, పీజీ, సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల ఫీజులను 15 శాతం పెంచే ప్రయత్నం చేయడం ద్వారా ప్రభుత్వం సామాన్య కుటుంబాలపై మరింత భారం మోపుతోందన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక వసతులు, హాస్టళ్లు, వైద్య పరికరాలు, అధ్యాపకుల కొరత వంటి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ముందుగా విద్యార్థులపై ఫీజుల భారాన్ని మోపడం ఏంటన్నారు. పేద విద్యార్థులు డాక్టర్లు కావాలనే కలలు కనడం తప్పా, డబ్బులు లేవని ప్రతిభ ఉన్న విద్యార్థులు వైద్య విద్యకు దూరం కావాలా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement