● కటౌట్ శ్రీను పాత్రపై నోరు మెదపరేం?
● నిందితులను తక్షణం అరెస్టు చేయాలి
● మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి డిమాండ్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): తన భర్త హత్య వెనుక టీడీపీ నాయకుడు కటౌట్ శ్రీను పాత్ర ఉందని జిమ్ ట్రైనర్ సతీష్‌రెడ్డి భార్య జయశ్రీ స్వయంగా ఆరోపించారని, దీనిపై పోలీసులు ఇప్పటి వరకూ ఎందుకు చర్య తీసుకోలేదని వైఎస్సార్ సీపీ కాకినాడ సిటీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రశ్నించారు. ప్రశాంతతకు మారుపేరైన కాకినాడలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నగరం నడిబొడ్డున భానుగుడి సెంటర్‌లో జరిగిన సతీష్‌రెడ్డి దారుణ హత్యే దీనికి ప్రధాన నిదర్శనమన్నారు. ఈ దారుణ హత్యకు సంబంధించి కటౌట్ శ్రీను వెనుక ఉన్న రాజకీయ శక్తులెవరని ప్రశ్నించారు. ఈ హత్య జరిగి వారం రోజులు గడుస్తున్నా, అతడిపై చర్యల విషయంలో పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారని నిలదీశారు. ఎవరి ఒత్తిడి వల్ల నిందితులను కాపాడుతున్నారని ప్రశ్నించారు. ఒక్క సతీష్‌రెడ్డి హత్యే కాకుండా గడచిన కొద్ది రోజులుగా కాకినాడలో శాంతిభద్రతల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా హత్యలు, దౌర్జన్యాలు, అరాచకాలు జరుగుతున్నప్పటికీ చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితికి కారణమేమిటని నిలదీశారు. హతుడు సతీష్‌రెడ్డి భార్య జయశ్రీ గర్భిణిగా ఉండి కూడా స్వయంగా బయటకు వచ్చి, ఆందోళన చేసి నిందితుల పేర్లు బహిరంగంగా ప్రకటిస్తున్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఆయన పేర్కొన్నారు. తక్షణమే ఆరోపణలు ఎదుర్కొంటున్న కటౌట్ శ్రీను, ఇతర నిందితులను అరెస్టు చేసి, దర్యాప్తు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. నేరాలను అదుపు చేసే విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే పరిస్థితి మరింత అదుపుతప్పి, ప్రశాంత కాకినాడ అశాంతికి నిలయంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిందితులను కాపాడాలని చూస్తే వైఎస్సార్ సీపీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ద్వారంపూడి హెచ్చరించారు.


