● మారికవలస వెళ్లకుండా
అడ్డుకున్న సర్పవరం పోలీసులు
● దుర్మార్గమని మండిపడిన మాజీ మంత్రి
కాకినాడ రూరల్: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉమ్మడి విజయనగరం, విశాఖపట్నం జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబును పోలీసులు మంగళవారం ఉదయం హౌస్ అరెస్టు చేశారు. విశాఖ జిల్లా మారికవలసలోని గురుకుల పాఠశాలను చంద్రబాబు ప్రభుత్వం మరోచోటుకు తరలిస్తోంది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వైఎస్సార్ సీపీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయిస్తోంది. దీనిలో భాగంగా కాకినాడ వైద్య నగర్‌లోని తన నివాసంలో ఉన్న కన్నబాబును హౌస్ అరెస్టు చేస్తున్నట్లు సర్ప వరం సీఐ సీహెచ్ ప్రకాష్ నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్ సీపీ నాయకులను అరెస్టు చేయడం చాలా దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మారికవలసలో 480 మంది విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో గిరిజన గురుకులం ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం హఠాత్తుగా జీఓ–69 జారీ చేసి మారికవలసతో పాటు మరికొన్ని గురుకులా లను తొలగిస్తోందని అన్నారు. విద్యార్థులను బలవంతంగా వేరే పాఠశాలలకు తరలించడాన్ని తల్లిదండ్రు లు వ్యతిరేకిస్తున్నారన్నారు. ఎవరి ప్రయోజనాల కో సం గురుకులాలను తరలిస్తున్నారని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వంలోనే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని కన్నబాబు విమర్శించారు. కాకినాడ లో ఎస్పీ కార్యాలయం సమీపాన ఇటీవల అర్ధరాత్రి 2 గంటలకు ఓ వ్యక్తిని చాలా అమానుషంగా చంపేశార ని, సాధిక్ అనే వ్యక్తి వలన ఒక కుటుంబం ఆత్మహత్య కు పాల్పడిందని, కొంత మంది యువకులు మద్యం తాగి గ్రూపులుగా ఏర్పడి కొట్టుకుంటున్నారని, గంజాయి, మద్యం వలన శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతోందని చెప్పారు. ఎవరైనా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఏ పార్టీ అని అడుగుతున్నారన్నారు. పోలీసులు చేయవలసిన పని కాకుండా హౌస్ అరెస్టులు చేయడం సరికాదని హితవు పలికారు.


