ఆక్వా రైతు ఆరోపణ
కరప: చేపల చెరువుకు చెందిన విద్యుత్ సరఫరాను అధికారులు కట్ చేయడంతో చేపలు చనిపోయాయని ఆక్వా రైతు ఆరోపించారు. మండలం కొంగోడు గ్రామానికి చెందిన ఆక్వా రైతు వి.నారాయణరావు వేములవాడలో ఐదు ఎకరాల్లో చేపలు సాగు చేస్తున్నారు. ఈ చెరువులకు సంబంధించి రూ.52 వేల విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో లైన్‌మన్ సరఫరా నిలిపివేశారు. దీంతో సరైన ఆక్సిజన్ అందక రూ.వేల విలువైన చేపలు చనిపోయినట్టు రైతు ఆరోపించారు. విద్యుత్ బిల్లు పూర్తిగా చెల్లించానని, అదనపు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లింపునకు రెండు రోజులు గడువు అడిగినా విద్యుత్ తొలగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై విద్యుత్ ఏఈ సానా ఈశ్వరప్రసాద్‌ను వివరణ కోరగా ఈ నెల ఆరో తేదీకి కట్టాల్సిన బిల్లు ఆలస్యంగా చెల్లించారని, సెక్యూరిటీ డిపాజిట్ రూ.8 వేలు సైతం ఏప్రిల్ నుంచి అడుగుతున్నా చెల్లించకపోవడంతో శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు లైన్‌మ్యాన్ విద్యుత్ సరఫరా నిలిపివేశారని, మళ్లీ రెండు రోజులు గడువు అడగడంతో 3.20 గంటలకు సరఫరా పునరుద్ధరించారని, ఈ స్వల్ప వ్యవధిలో చేపలు చనిపోయాయనడం సరికాదని తెలిపారు. రెండురోజుల క్రితం నుంచి చేపలు చనిపోతున్నట్టు పక్కరైతులు తెలిపారన్నారు.


