ఎస్పీ బిందుమాధవ్
కాకినాడ క్రైం: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ నేరాలకు పాల్పడుతున్న, చేయిస్తున్న నేరస్తులను ఏమాత్రం ఉపేక్షించొద్దని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నేరాల సంఖ్యను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టిసారించాలని చెప్పారు. స్పందన ద్వారా అందిన ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. బాలలు, మహిళలపై నేరాలకు పాల్పడుతున్నవారిని చట్టప్రకారం శిక్షించాలన్నారు. జిల్లాలో సీసీ కెమెరాల నిఘా, బీట్, గస్తీ మరింత ముమ్మరం చేయాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఏమాత్రం ఉపేక్షించొద్దని చెప్పారు. రాత్రివేళ ఇళ్లు కొల్లగొడుతున్న నేరస్తులు, గంజాయి సహా మాదక ద్రవ్యాలకు అలవాటుపడి, విక్రయిస్తున్నవారిపై పూర్తిస్థాయి నిఘా కొనసాగించాలని ఆదేశించారు.
వీఆర్‌కు సీఐ!
కాకినాడ క్రైం: ఈ నెల 23న అర్ధరాత్రి కాకినాడ భానుగుడి జంక్షన్‌లో జరిగిన కిరాతక హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ ఘటన జిల్లా పోలీసు వర్గాల్లో కాక రేపింది. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల ఆగ్రహానికి కారణమైంది. శాంతిభద్రతల వైఫల్యమంటూ, పోలీసుల చేతకాని తనమని తీవ్ర విమర్శలకు కారణమైంది. జిల్లా ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఘటన జరగడం, కమాండ్ కంట్రోల్ సిబ్బంది ఆ సమయంలో నిద్రపోతుండడం భద్రతా వైఫల్యాన్ని వేలెత్తి చూపించింది. ఈ నేపథ్యంలో శనివారం కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్వయానా ఐజీ అశోక్‌కుమార్ జోక్యం చేసుకుని జూమ్ సమావేశంలో ఘటన జరిగిన పరిధికి చెందిన ఇన్‌స్పెక్టర్‌తోను, జిల్లా ఎస్పీ బిందు మాధవ్‌తోను మాట్లాడారు. పోలీసుల భద్రతా వైఫల్యంతో పాటు మీడియాతో మాట్లాడి హత్యకు కారకుడని భావిస్తున్న కటౌట్ శ్రీను పేరు చెప్పబోతుండగా మృతుడి భార్యను అడ్డుకున్న పోలీసు అధికారి వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఐని వీఆర్‌కు పంపించేందుకు ఆదేశించినట్టు తెలిసింది.
నన్ను ఎవరో
వెంటాడుతున్నారు
హత్యకు గురైన సతీష్‌రెడ్డి భార్య జయశ్రీ
కాకినాడ క్రైం: కాకినాడ భానుగుడి జంక్షన్‌లో దారుణ హత్యకు గురైన సతీష్‌రెడ్డి భార్య జయశ్రీ తనకు ప్రాణహాని ఉందని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు గడచిన మూడు రోజులుగా తనను వెంటాడుతున్నారని శనివారం మీడియా ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. తాను శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చోట మీడియా ప్రతినిధులతో కలిసిపోయి ఒక మహిళ, ఒక పురుషుడు తన ఫొటోలు, వీడియోలు తీసుకున్నారన్నారు. వారిద్దరూ శనివారం తన ఇంటి చుట్టూ తిరుగుతూ రెక్కీ నిర్వహించారని జయశ్రీ తెలిపారు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. స్పెషల్ బ్రాంచ్ అధికారులు తనతో మాట్లాడి సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులు కేసు నమోదులో సహకరిస్తారని చెప్పారని వివరించారు. ఈ హత్య విషయంలో కటౌట్ శ్రీనుపై ఫిర్యాదు చేసేందుకు సోమవారం ఆమె పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎస్పీని కలవనున్నట్టు చెప్పారు.
పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఐసీడీఎస్ ద్వారా అమలుచేసే పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. జిల్లా ప్రజా పరిషత్తు సమావేశ మందిరంలో ఎంపీ టి.ఉదయ్ శ్రీనివాస్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహనకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం ఐసీడీఎస్, డ్వామా, వ్యవసాయ, ఉద్యాన, ఏపీఎంఐపీ, పశు సంవర్ధక, విద్య, వైద్య ఆరోగ్య, బ్యాంకింగ్, పోర్టు, పంచాయతీరాజ్, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి తదితర శాఖలపై సమీక్షించారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఎమ్మెల్యే ఎన్.రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


