రుడాకు కొత్త రూపం | - | Sakshi
Sakshi News home page

రుడాకు కొత్త రూపం

Aug 30 2026 12:09 AM | Updated on Aug 30 2026 12:09 AM

నగరపాలక సంస్థ, మూడు

మున్సిపాలిటీలు, 314 పంచాయతీలు

మొత్తం 2,838 కిలోమీటర్ల విస్తీర్ణం

పునర్‌ వ్యవస్థీకరిస్తూ

ప్రభుత్వ నోటిఫికేషన్‌ జారీ

సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (రుడా) పరిధిని ప్రభుత్వం పునర్‌ వ్యవస్థీకరించింది. మొత్తం తూర్పుగోదావరి జిల్లాను రుడా పరిధిలోకి తీసుకొచ్చింది. జిల్లాలోని 22 మండలాల్లోని 314 పంచాయతీలతో పాటు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, కొవ్వూరు, నిడదవోలు, మండపేట మున్సిపాలిటీ వరకూ విస్తరించింది. ఫలితంగా 2,838 కిలోమీటర్ల మేర రుడా పరిధి మారింది. అదే సమయంలో ఇప్పటి వరకూ రుడా పరిధిలోని అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ప్రాంతాలను మినహాయించింది. విభజించిన జిల్లాల భౌగోళిక స్వరూపానికి అనుగుణంగా, పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ మేరకు మార్పులు చేసింది.

కలసిన ప్రాంతాలు ఇవే..

గతంలో 17 మండలాల్లోని 207 గ్రామాలు, ఒక నగరపాలక సంస్థ, 3 పట్టణ స్థానిక సంస్థలు కలిసి మొత్తం 1566.442 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రుడా ఉండేది. జిల్లాల విభజనతో తూర్పుగోదావరిలో కలిసిన మండపేట మున్సిపాలిటీని ప్రస్తుతం రుడా పరిధిలోకి తీసుకొచ్చారు. అలాగే ఇప్పటి వరకూ రుడాలో లేని కడియం మండలంలోని మూడు గ్రామాలు, గోకవరంలోని 15, అనపర్తిలోని ఆరు, బిక్కవోలులోని ఆరు, మండపేటలోని ఆరు, రాయవరంలోని మూడు, కపిలేశ్వరపురంలోని ఒక గ్రామాన్ని కలిపారు. మొత్తంగా ఒక మున్సిపాలిటీతో పాటు ఏడు మండలాల్లోని 40 గ్రామాలను విలీనం చేశారు. దీంతో జిల్లాలోని రాజమహేంద్రవరం అర్బన్‌తో పాటు మిగిలిన 21 మండలాల్లోని 314 పంచాయతీలు, నాలుగు పట్టణ స్థానిక సంస్థలు రుడా పరిధిలోకి వచ్చేశాయి.

మినహాయించినవి ఇవే..

ఇప్పటి వరకూ రుడా పరిధిలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం మున్సిపాలిటీని మినహాయించారు. అలాగే రామచంద్రపురం రూరల్‌ మండలంలోని 20 గ్రామాలు, కోటిపల్లి, గంగవరంలోని 24, ఆలమూరులోని 15, ఆత్రేయపురంలోని 15, రావులపాలెం మండలంలోని 11 గ్రామాలను రుడా నుంచి మినహాయించారు. గోపాలపురం నియోజకవర్గంలో భాగమైనప్పటికీ ఏలూరు జిల్లాకు చెందిన ద్వారకాతిరుమల మండలంలోని 36 గ్రామాలను కూడా తొలగించారు. మొత్తంగా ఒక మున్సిపాలిటీతో పాటు ఆరు మండలాల్లోని 121 పంచాయతీలను రుడా పరిధి నుంచి మినహాయించారు. ఈ మేరకు మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

సౌకర్యాలు మెరుగుకు అవకాశం

● తూర్పుగోదావరి జిల్లా మొత్తం రుడా పరిధిలోకి రావడంతో సౌకర్యాలు మెరుగుపడడంతోపాటు ఆస్తుల విలువలు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో సామాన్యులపై పన్నుల భారం పడనుంది.

● పంచాయతీల్లోని రోడ్లు, డ్రైనేజీలను నగర స్థాయి ప్రమాణాలతో నిర్మించే అవకాశం ఉంటుంది. వీధి దీపాలు, తాగునీటి సరఫరా మెరుగవుతుంది.

● గ్రామంలోని భూములు, ఇళ్ల విలువలు ఒక్కసారిగా పెరుగుతాయి.

● గ్రామాల్లోని ఇళ్లను ఇక నుంచి ప్రణాళికతో నిర్మించాల్సి ఉంటుంది.

● శివారు ప్రాంతాలకు కూడా రియల్‌ ఎస్టేట్‌ రంగం విస్తరిస్తుంది.

● పంచాయతీల్లో లేఅవుట్లు వేసేందుకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు చెల్లించే రుసుములో నుంచి కొంత భాగాన్ని రుడా మళ్లీ పంచాయతీలకు అందిస్తుంది. ఫలితంగా ఆ నిధులతో అక్కడ అభివృద్ధి పనులకు అవకాశం ఉంటుంది.

పన్నుల భారం.. అనుమతుల్లో జాప్యం

రుడా పరిధిలోకి రావడంతో గ్రామాల్లోని వ్యవసాయ భూముల ధరలు పెరగడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వాటిని ప్లాట్లుగా మార్చే అవకాశం ఉంది. దీంతో పచ్చని పంట పొలాలు కాంక్రీట్‌ జంగిల్‌గా మారిపోయే ప్రమాదం ఉంది.

ఇప్పటి వరకూ పంచాయతీల్లో ఇల్లు కట్టుకోవాలంటే సర్పంచ్‌ లేదా కార్యదర్శి సంతకం సరిపోయేది. కానీ రుడా పరిధిలోకి వచ్చాక ఆన్‌లైన్‌ దరఖాస్తులు, బిల్డింగ్‌ ప్లాన్‌ అప్రూవల్స్‌ కోసం రాజమహేంద్రవరంలోని కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుంది.

కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా లేకంటే ఉన్న ఇల్లు విస్తరించాలన్నా రుడాకు లేఅవుట్‌ డెవలప్‌మెంట్‌ చార్జీలు, అప్రూవల్‌ ఫీజుల రూపంలో రూ.వేలు చెల్లించాలి.

పంచాయతీ పన్నుల స్థానంలో అర్బన్‌ అథారిటీ స్థాయి పన్నులు అమలులోకి వస్తాయి. ఫలితంగా గృహ, నీటి పన్నులు గణనీయంగా పెరుగుతాయి. ఇది సామాన్యులకు ఆర్థిక భారం కానుంది.

ప్రభుత్వ భూమి విలువ పెరగడంతో రిజిస్ట్రేషన్‌ చార్జీలు, స్టాంప్‌ డ్యూటీ భారం పడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement