ఐ.పోలవరం: గోదావరి వరద పెరిగి, క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి బుధవారం 3,55,194 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టారు. గురువారం ఉదయం 6 గంటలకు ఇది కాస్తా 5,17,171 క్యూసెక్కులకు పెరిగింది. ఇది శుక్రవారం ఉదయం ఆరు గంటలకు 4,20,616 క్యూసెక్కులకు తగ్గింది. బ్యారేజీ వద్ద వరద ఉధృతి తగ్గినప్పటికీ జిల్లాలో గౌతమి, వృద్ధ గౌతమి, వైనతేయ, వశిష్ట గోదావరి పాయల్లో ఆ ఉరవడి కొనసాగుతూనే ఉంది. ఐ.పోలవరం మండలం అన్నంపల్లి అక్విడెక్ట్ వద్ద వరద నీరు ఉరకలేస్తూ సముద్రం వైపు పరుగులు తీస్తోంది. శివారున ఉన్న ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం, అల్లవరం, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లోని ఆక్వా చెరువులను వరద మరోసారి ముంచెత్తింది. ఇప్పటికే ఈ నెల మొదటి వారంలో వచ్చిన వరదకే ఆక్వా చెరువులు పెద్ద ఎత్తున దెబ్బ తినడంతో, ఇప్పుడు ప్రభావం పెద్దగా లేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుత వరదతో ఎలాంటి ముంపు ముప్పూ లేదని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు.


