చికిత్స పొందుతూ యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ యువకుడి మృతి

Aug 23 2026 12:16 AM | Updated on Aug 23 2026 12:16 AM

రౌతులపూడి: రౌతులపూడి – కత్తిపూడి ఆర్‌ అండ్‌ బీ రహదారిలో బంగారయ్యపేట సమీపంలో ఈ నెల 20న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ములగపూడికి చెందిన కాపారపు ఏలిసా రాజు (23) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. వివరాలు.. కాజులూరు మండలం దుగ్గుదుర్రుకు చెందిన కొందరు ఒక ప్రైవేటు కారులో నాతవరం మండలం సరుగుడు వాటర్‌ పాల్స్‌కు వెళ్లి తిరిగి వస్తున్నారు. బంగారయ్యపేట సమీపంలో ఎదురుగా రౌతులపూడి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న కాపారపు ఏలిసా రాజును ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరిన రాజును వెంటనే స్థానికులు రౌతులపూడి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యుడు భరత్‌ క్షతగాత్రుడికి వైద్య పరీక్షలు జరిపి, మెరుగైన చికిత్స కోసం కాకినాడ తరలించారు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ రాజు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. కాగా.. రాజుకు తల్లి రాఘవ, తండ్రి వరహాలు, సోదరుడు విజయ్‌బాబు, సోదరి వరలక్ష్మి ఉన్నారు.

మద్యం మత్తులో కారు డ్రైవింగ్‌

త్రుటిలో ప్రమాదం నుంచి

బయటపడిన కాబోయే వరుడు

పిఠాపురం రూరల్‌: మద్యం మత్తులో అతి వేగంగా డ్రైవింగ్‌ చేసిన యువకుడు అదుపు తప్పి కాలువ పక్కనున్న పొదల్లోకి కారుతో దూసుకుపోయాడు. పిఠాపురం మహారాజా వారధి సమీపంలో శనివారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. పెద్దాపురానికి చెందిన దమ్మాల వీర వెంకట దుర్గా ప్రసాద్‌కు ఈ నెల 26న వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో శనివారం స్నేహితులతో కలిసి మద్యం పార్టీ చేసుకుని అనంతరం కాకినాడ నుంచి పిఠాపురం వైపు కారులో బయలుదేరాడు. మద్యం మత్తులో అతివేగంగా కారు నడపడంతో పిఠాపురం మహారాజా వారధి సమీపాన అదుపు తప్పి రహదారి పక్కనున్న కాలువ పొదల్లోకి దూసుకెళ్లింది. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు కారులో చిక్కుకున్న దుర్గా ప్రసాద్‌ను బయటకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారులో వివాహ ఆహ్వాన పత్రికలతో పాటు మద్యం బాటిల్‌ ఉన్నట్లు గుర్తించారు. కాగా.. దుర్గా ప్రసాద్‌ కాకినాడ ఎస్‌ఆర్‌ఎంటీ – ఏపీఎస్‌పి ప్రాంతం మధ్యలో కారు నడుపుతూ పలుమార్లు అటూ ఇటూ ఊపుతూ, ఎదురుగా వెళుతున్న ఆటోలను సైతం పక్కకు తప్పించుకుంటూ వచ్చినట్లు ఓ ఆటో డ్రైవర్‌ తెలిపాడు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

అడ్డతీగల: ట్రాక్టర్‌ను ఆటో ఢీకొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న గిరిజన మహిళ మృతి చెందింది. అడ్డతీగల మండలం వీరభద్రపురం వద్ద జాతీయ రహదారిపై శనివారం ఈ ప్రమాదం జరిగింది. వీరంపాలెం గ్రామానికి చెందిన 12 మంది ఆటోలో రాజవొమ్మంగి వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. వీరభద్రపురం వద్ద ఆ గ్రామం నుంచి జాతీయ రహదారిపైకి ట్రాక్టర్‌ వస్తుండగా, దాన్ని తప్పించబోయి ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న లోతా లక్ష్మి సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన బచ్చల చంటమ్మ, పేరు కాంతమ్మ, రేవుల ఈశ్వరమ్మ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అడ్డతీగల సీహెచ్‌సీకి తరలించారు. ఈ ఘటనపై అడ్డతీగల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement