పి.గన్నవరం: కొబ్బరి తోటలో పనిచేస్తుండగా పాము కాటు వేయడంతో వ్యవసాయ కూలీ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే. కె.ఏనుగుపల్లికి చెందిన శేరు ముసలయ్య (49) చేపల వేటతో పాటు, వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం వై.కొత్తపల్లి సమీపంలో ఒక రైతుకు చెందిన తోటలో కొబ్బరి కాయలు దింపు తీస్తుండగా, ముసలయ్య వాటిని పోగు చేసి మరొక చోటికి తరలిస్తున్నాడు. ఈక్రమంలో అతడి ఎడమ కాలుపై పొడపాము కాటు వేసింది. సంబంధిత రైతు ముసలయ్యను వెంకటనే కారులో పి.గన్నవరం సీహెచ్‌సీకి తీసుకువచ్చాడు. అక్కడ చికిత్స పొందుతూ ముసలయ్య మృతి చెందాడు. మృతుడికి భార్య మంగాదేవి, కుమారుడు దుర్గా ప్రసాద్, కుమార్తె కొండాలక్ష్మి ఉన్నారు. మృతదేహానికి రాజోలు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ప్రమాదానికి కారణమైన పామును గ్రామస్తులు హతమార్చారు. పి.గన్నవరం ఎస్సై ఇ.నరసింహమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


