బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కొద్ది రోజులు గడిస్తే ఖరీఫ్ పంట చేతికి అందేసేదే.. సరిగ్గా అదే తరుణంలో.. గత ఏడాది అక్టోబర్ నెలాఖరులో మోంథా తుపాను విరుచుకుపడింది. అధికారుల లెక్కల ప్రకారం ఈ తుపాను ధాటికి జిల్లావ్యాప్తంగా 46,900 మంది రైతులకు చెందిన 52,545 ఎకరాల్లో వరి పంట దెబ్బ తింది. వీరికి రూ.57.21 కోట్ల మేర పరిహారం ఇవ్వాల్సి ఉంది. ఇతర పంటలన్నీ కలిపి మొత్తం రూ.62 కోట్ల పరిహారం చెల్లించాలంటూ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. తుపానుతో పంట నష్టాలు వాటిల్లి ఇప్పటికే 4 నెలలు దాటింది. ఖరీఫ్ సీజన్ ముగిసిపోయింది. రబీ సీజన్ కూడా మరో నెల రోజులకు కాస్త అటుగా పూర్తి కానుంది. కానీ, మోంథా తుపాను బాధిత రైతులకు ప్రభుత్వం ఇప్పటి వరకూ నయాపైసా కూడా పరిహారం చెల్లించలేదు. దీంతో, ఆ పరిహారం ఎప్పుడిస్తారంటూ అధికారులను రైతులు ప్రశ్నిస్తున్నారు.
పెట్టుబడికి తప్పని అప్పులు
ప్రస్తుత రబీ వరి పంట చిరుపొట్ట దశలో ఉంది. ఈ తరుణంలో రైతులు ఎకరా వరికి యూరియాతో పాటు పొటాషియం, కాంప్లెక్సు ఎరువులు వేయాల్సి ఉంటుంది. దీనికిగాను ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకూ పెట్టుబడి అవసరం. ప్రభుత్వం ‘మోంథా’ పరిహారం చెల్లించకపోవడంతో రబీ పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేయాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కరప మండలం వాకాడలో పర్యటించిన జిల్లా వ్యవసాయాధికారి ఎన్.విజయ్ కుమార్‌ను అక్కడి రైతులు తుపాను పరిహారంపై ప్రశ్నించారు. ఆ సందర్భంగా ప్రభుత్వం నుంచి రూ.62 కోట్లు రావాల్సి ఉందని, కాస్త ఓపిక పట్టాలని రైతులకు సర్ది చెప్పాల్సి వచ్చింది.
బీమా లేక.. పరిహారం రాక
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఉచిత పంట బీమా పథకాన్ని అమలు చేసింది. ప్రకృతి విపత్తులతో పంట నష్టం వాటిల్లితే ఆ సీజన్ ముగియకుండానే రైతులకు పరిహారం అందించేది. ఈవిధంగా వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో జిల్లాలోని రైతులకు రూ.296.51 కోట్ల మేర బీమా పరిహారం అందించింది. రైతులకు ఎంతో మేలు చేసిన ఉచిత పంట బీమాను చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రద్దు చేసింది. ప్రీమియం భారాన్ని రైతుల పైనే మోపింది. దీంతో, ఎకరాకు రూ.640 చొప్పున రైతులు ప్రీమియం చెల్లించాల్సి వచ్చింది. ఐదెకరాల నుంచి 20 ఎకరాల వరకూ సాగు చేసే పలువురు రైతులకు ప్రీమియం భారం కావడంతో చాలా మంది పంటల బీమాకు దూరమయ్యారు. జిల్లావ్యాప్తంగా గత ఖరీఫ్‌లో 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. ఇందులో సుమారు లక్ష ఎకరాలకు సంబంధించి సుమారు 52 వేల మంది రైతులు మాత్రమే బీమా ప్రీమియం చెల్లించారు. వీరికి మాత్రమే అధికారులు పంట నష్టపరిహారం అంచనాలు తయారు చేశారు. మిగిలిన 1.10 లక్షల ఎకరాలకు సంబంధించిన రైతులు ప్రీమియం చెల్లించలేకపోయారు. దీంతో, వారికి ఒక్క రూపాయి కూడా పరిహారం రాని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు బీమా ప్రీమియం చెల్లించిన వారికి కూడా పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది.
పరిహారం త్వరగా చెల్లించాలి
నేను ఐదెకరాల్లో వరి సాగు చేస్తున్నాను. మోంథా తుపానుతో నా పంట దెబ్బ తింది. నష్ట పరిహారం వస్తుందని నాలుగు నెలలుగా ఎదురు చూస్తున్నాను. ప్రస్తుత రబీలో పెట్టుబడికి డబ్బులు లేక అవస్థలు పడుతున్నాను. ప్రభుత్వం వెంటనే మోంథా తుపాను నష్టపరిహారం అందిస్తే నాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉచిత పంట బీమా పథకం అమలు చేస్తే రైతులకు ఎంతో మేలు జరిగేది. ఈ పథకం రద్దు చేయడం బాధాకరం.
– నున్న వేంకటేశ్వరరావు, రైతు,
విజయరాయుడుపాలెం, కరప మండలం
గత ఏడాది అక్టోబర్‌లో
విరుచుకుపడిన ‘మోంథా’
జిల్లాలో 52 వేల ఎకరాల్లో
నీట మునిగిన వరి
రైతులకివ్వాల్సిన పరిహారం
రూ.57.21 కోట్లు
4 నెలలు గడచినా
నయాపైసా ఇవ్వని సర్కారు
46,900 మంది రైతులకు
తప్పని ఎదురుచూపులు


