కాకినాడ రూరల్: చంద్రబాబు ప్రభుత్వం మూడు రోజులుగా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ డ్రామాలు ఆడుతోందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నేత జమ్మలమడక నాగమణి విమర్శించారు. జగన్ పాలనలో మహిళల పేరిట ఇళ్ల స్థలాలు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి నిజమైన సాధికారతను చూపించారని, నేడు చంద్రబాబు పాలనలో మహిళాభ్యుదయానికి చీకటి కాలం దాపురించిందని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలో సభ నిర్వహించడంపై ఆమె సోమవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. మహిళలకిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ‘మహిళా సాధికారత’ అనే పదం పలికే అర్హత చంద్రబాబుకు లేదని అన్నారు. ఎన్నికల ముందు 18 నుంచి 59 ఏళ్ల లోపు ఉన్న 1.80 కోట్ల మంది మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని చంద్రబాబు చెప్పారని, ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా విదల్చలేదని గుర్తు చేశారు. ఈ బాకీ ఎప్పుడు చెల్లిస్తారని నిలదీశారు. అలాగే, 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలను నిలువునా వంచించారన్నారు. బడికి వెళ్లే ప్రతి బిడ్డకు రూ.15 వేల చొప్పున ఇస్తామని, మొదటి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారని, రెండో ఏడాది లక్షలాది మందిని తొలగించి, అరకొరగా విదిల్చారని గుర్తు చేశారు. ఇప్పటికీ విద్యార్థుల తల్లులకు ప్రభుత్వం రూ.వేల కోట్ల బాకీ పడిందని లెక్కలతో సహా వివరించారు. ఏడాదికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలంటే రూ.3,990 కోట్లు కావాలని, కానీ బడ్జెట్ కేటాయింపులు చూస్తే బాకీలే కనిపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చి, 10 లక్షల ఇళ్లు పూర్తి చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఒక్క గజం స్థలం కూడా పేదలకివ్వలేదని ధ్వజమెత్తారు. సున్నా వడ్డీ పథకాన్ని అటకెక్కించి, డాక్రా మహిళల ఆర్థిక వెన్నెముక విరిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దిశ పోలీస్ స్టేషన్లను, దిశ యాప్‌ను నిర్వీర్యం చేసి, రాష్ట్రాన్ని ’అత్యాచార ఆంధ్రప్రదేశ్’గా మార్చారని తీవ్రంగా విమర్శించారు. బెల్టు షాపులు పెంచి, మహిళల కాపురాల్లో చిచ్చు పెట్టడమే చంద్రబాబుకు తెలిసిన సాధికారత అని ఎద్దేవా చేశారు. ఇన్ని తప్పులు చేసిన చంద్రబాబు.. మహిళా సాధికారత గురించి మాట్లాడటం హాస్యాస్పదం, దుర్మార్గమని నాగమణి దుయ్యబట్టారు.


